శ్రీరెడ్డికి ఒక‘లా’.. పోసానికి మరో‘లా’..

శ్రీరెడ్డి, పోసాని క్రిష్ణమురళీ ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే.. గత ప్రభుత్వంలో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కామెంట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Update: 2025-02-27 07:08 GMT

ఏపీలో పోలీసు ‘లా’పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానంగా వైసీపీ నేతలు, శ్రేణులే టార్గెట్ గా జరుగుతున్న అరెస్టులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కంట్రోల్ తప్పి కామెంట్లు చేసిన వారు కటకటాల వెనక్కి వెళుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. గత ప్రభుత్వంలో ఎవరి అండ చూసుకుని మాట్లాడారో గానీ, ఇప్పుడు అలాంటి వారికి మాటలే శాపాలుగా మారుతున్నాయని అంటున్నారు. అయితే ఈ అరెస్టుల విషయంలో కొందరి పట్ల పోలీసులు అనుసరిస్తున్న విధానం మరింత చర్చకు దారితీస్తోంది. తాజాగా అరెస్టు అయిన సినీ ప్రముఖుడు పోసాని, అంతకు ముందు ముందస్తు బెయిల్ మంజూరైన శ్రీరెడ్డి విషయంలో పోలీసులు భిన్నంగా వ్యవహరించడంపై పెద్ద డిబేట్ జరుగుతోంది.

శ్రీరెడ్డి, పోసాని క్రిష్ణమురళీ ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే.. గత ప్రభుత్వంలో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన కామెంట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరిపైనా ఏపీ వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అందిన ప్రతి ఫిర్యాదుపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఇంతవరకు అరెస్టుల వరకు వెళ్లలేదు. వారిని ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చని ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. మరోవైపు అదే సినీ రంగానికి చెందిన డైరెక్టర్ రామగోపాలవర్మపైనా కేసులు నమోదయ్యాయి. ముందుగా డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన పోలీసులు శ్రీరెడ్డి, పోసానిని మాత్రం వెనక్కి పెట్టారు. అయితే తమది తప్పైపోయిందని చెప్పిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో దూషణలకు దూరంగా జరిగిపోయారు. అదేసమయంలో ఆమె భక్తి వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. మరోవైపు కేసులు నమోదవుతున్న వేళ బెదిరిపోయిన క్రిష్ణవంశీ రాజకీయాలకు సెలవు ప్రకటించారు. తాను ఎవరినీ కావాలని తిట్టలేదని వివరణ ఇచ్చుకున్నారు. వర్మను విచారణకు పిలిచి వదిలిపెట్టిన పోలీసులు పోసానికి మాత్రం కనీసం విచారణకు పిలవకుండానే అరెస్టు చేయడం చర్చకు దారితీస్తోంది.

ఇదే సమయంలో అత్యంత హేయమైన భాషలో విరుచుకుపడిన శ్రీరెడ్డి అధికారం చేతులు మారిన తర్వాత.. సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్న వేళ తనది తప్పైపోయింది క్షమించండి అంటూ శ్రీరెడ్డి వేడుకున్నారు. తన భవిష్యత్తు తను కుటుంబంలో ఆడపిల్లల ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకోవాలని, తాను గతంలో చేసినదానికి పశ్చాత్తాపం చెందుతున్నట్లు వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కుటుంబ సభ్యులు అందరినీ పేరుపేరునా సంబోధిస్తూ సారీ చెప్పారు శ్రీరెడ్డి. మరోవైపు మహిళగా భావించి ప్రభుత్వం కూడా ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ వచ్చింది. ఇలా శ్రీరెడ్డి విషయంలో ప్రభుత్వం క్షమాగుణం ప్రదర్శించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతకుముందు మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ కేసు విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విధంగా వ్యవహరించారని చెబుతున్నారు. సాక్ష్యాత్తూ తమ కుటుంబంలో మహిళల అరెస్టుపై చంద్రబాబు వారించారని పేర్ని చెప్పడం విశేషం. అదే విధానం శ్రీరెడ్డి విషయంలోనూ అమలు చేశారని అంటున్నారు. తప్పు చేసిన మహిళలపై కఠినంగా వ్యవహరించొద్దన్న చంద్రబాబు ఆదేశాలే శ్రీరెడ్డి బెయిల్ వచ్చేందుకు ఉపయోగపడ్డాయని అంటారు.

కానీ, పోసాని విషయంలో ప్రభుత్వం ఇలాంటి క్షమాగుణానికి తావు లేకుండా నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన పోసాని తన పదవీ కాలంలో తన బాధ్యతలు, విధులపై మాట్లాడే విషయాన్ని పక్కనపెట్టి ఎక్కువగా అప్పటి ప్రతిపక్షాన్ని దుర్భాషలాడేందుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం పరిధి దాటి బూతులు దండకం చదవడమే ఆయనను పోలీసులు అరెస్టు చేశారంటున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారందరికి అరెస్టు కొనసాగుతాయని ఇటీవలే హెచ్చరించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పట్టిన గతే పడుతుందని మండలి సమావేశాల్లో మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇదే సందర్బంలో సినీ రంగానికి చెందిన వారిపై చర్యలకు దిగడం విశేషంగా చెబుతున్నారు. సహజంగా సాధారణ ప్రజల కంటే సినీ రంగంలో ఉన్నవారి అరెస్టులపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. గ్లామర్ ఫీల్డ్ లో పనిచేయడం వల్ల వారి ప్రవర్తన ఇతరులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మిగతా వారి కన్నా, సినీ రంగంలో పనిచేస్తూ దూషణలకు దిగిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మహిళగా శ్రీరెడ్డి క్షమాభిక్ష అందుకోవడం కూడా పోసాని అరెస్టు నేపథ్యంలో చర్చకు దారితీసింది.

Tags:    

Similar News