ఏపీలో జీబిఎస్ విజృంభణ.. 59కి పెరిగిన కేసులు
కరోనా మహమ్మారిని మరచిపోక ముందే జీబీఎస్ వైరస్ సవాల్ విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపుతోంది. స్వల్ప వ్యవధిలోనే వైరస్ విజృంభిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 59 మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. కొద్దిరోజుల కిందట జీబీఎస్ లక్షణాలతో ఆరేళ్ల బాలుడు మరణించడగా, ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ కూడా మరణించింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.
కరోనా మహమ్మారిని మరచిపోక ముందే జీబీఎస్ వైరస్ సవాల్ విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59 కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో కేవలం 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణతో మంత్రి సత్యకుమార్ యాదవ్ నిరంతరం వైద్యాధికారులతో సమీక్షిస్తున్నారు. దీంతో వైద్యాధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నా, కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతున్నందున అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. కరోనా కంటే జీబీఎస్ ప్రమాదకమంటూ హెచ్చరికలు జారీ అవుతుండటంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వ్యక్తిగతంగా జీబీఎస్ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సమయంలో కనీసం వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించారు. కానీ జీబీఎస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన లోపించింది. వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉండటంతో బాధితులు వెంటనే తెలుసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. వ్యాధి లక్షణాలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరణించే ప్రమాదం ఉందని జరుగుతున్న ప్రచారం ప్రజలను భయపెడుతోంది.
కాగా, జీబీఎస్ మరణాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. శ్రీకాకుళంలో ఆరేళ్ల బాలుడు, ప్రకాశం జిల్లాలో మరణించిన మహిళను నాలుగైదు ఆస్పత్రులకు తిప్పడం, చివరగా ప్రభుత్వ ఆస్పత్రికి తేవడం వల్ల ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ వ్యాధి నిర్థారణకు ప్రభుత్వం ప్రత్యేక పరీక్షలను నిర్వహిస్తోంది. జీబీఎస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండటం లేదు. కొంత మందికి దగ్గు, జ్వరంతోపాటు కాళ్లు, చేతులు పట్టేస్తున్నాయి. కొంతమందికి విరేచనాలు అవుతున్నాయి. ఏదైనా నాడీ వ్యవస్థ దెబ్బతీస్తోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నరాల సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.