ఖాళీ అయ్యే 5 ఎమ్మెల్సీ స్థానాలకు సిట్టింగులకు నో ఛాన్స్
శనివారం కూటమి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు నాగబాబు నామినేషన్లు దాఖలు చేయటం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల సంగతేంటి?;
ఖాళీ అయ్యే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల వేడి ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో హీట్ రేపుతోంది. అయితే.. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశంపై చర్చ నడుస్తోంది. దీని సారాంశం ఏమంటే.. ఇప్పుడు ఖాళీ అయ్యే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో సిట్టింగులకు సీటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా లేరన్న మాట బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్న వారిలో యనమల రామక్రిష్ణుడు.. అశోక బాబు.. బీటీ నాయుడు.. దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరుకు పూర్తి కానుండగా.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జంగా క్రిష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేయటం తెలిసిందే. తాజాగా ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటం.. నామినేషన్లు కార్యక్రమం షురూ అయ్యింది.
శనివారం కూటమి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు నాగబాబు నామినేషన్లు దాఖలు చేయటం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల సంగతేంటి? అందులో అధికార టీడీపీకి దక్కేస్థానాలు ఎన్ని? అభ్యర్థులు ఎవరు? అన్నది చర్చ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే మిగిలేది మూడు స్థానాలే. కానీ.. బీజేపీ ఫోకస్ మొత్తం రాజ్యసభ స్థానాల మీదనే తప్పించి ఎమ్మెల్సీల మీద వారి ఫోకస్ లేదంటున్నారు. దీంతో.. మిగిలిన నాలుగు స్థానాలు టీడీపీకే వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు.
మరి.. అభ్యర్థులుగా ఎవరెవరు బరిలో నిలుస్తారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. ప్రసత్ుతం సిట్టింగులుగా ఉన్న నలుగురికి అవకాశంలభించదన్న మాట బలంగా వినిపిస్తోంది. అత్యంత సీనియర్ అయిన యనమల రామక్రిష్ణుడుు ఈసారి రెన్యువల్ అవకాశం దాదాపు లేదని స్పష్టం చేస్తున్నారు. యువ నాయకత్వాన్ని పెంచటంతో పాటు.. వారికి పదవుల్ని కేటాయించటం ద్వారా కొత్త రక్తాన్ని నింపాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
సీనియర్లకు ఇప్పటికే పలుమార్లు అవకాశాలు కల్పించిన నేపథ్యంలో.. ఇప్పటికి వారికే పదవులు కేటాయిస్తే.. యువతరానికి అవకాశం లభించేది ఎప్పుడూ అనేది ప్రశ్నగా మారింది. నిజానికి ఈ ప్రశ్న గతంలోనూ ఉన్నా పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. విపక్ష హోదాలో గడిచిన ఐదేళ్ల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీకి కొత్త రక్తం అవసరాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టటం ఓకే అనుకున్నా.. వైసీపీ నుంచి వచ్చిన జంగాను సైతం పక్కను పెట్టేసే అంశంపై హాట్ చర్చ నడుస్తోంది. అయితే.. అభ్యర్థుల ప్రకటన తర్వాతే.. పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందన్న దానిపై మరింత క్లారిటీ వచ్చే వీలుందని చెప్పక తప్పదు.