కూటమి ప్రకటన: ఉగాది నుంచి 'పీ-4'
ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4 పథకాన్ని ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనుంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4 పథకాన్ని ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను తాజాగా ఖరారు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పీ-4 అంటే.. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా.. పేదలను ధనుకులుగా చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో వివిధ ప్రాజెక్టులకు కూడా.. దీనిని అవలంభించనున్నారు.
తొలుత ఉగాది నాడు `పీ-4` పోర్టల్‌ను ఆవిష్కరిస్తారు. దీని ద్వారా పీ-4 విధానాన్ని ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. అనంతరం వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక, ఈ విధానానికి వస్తే.. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది.. పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వాలి. దీనిలో పారిశ్రామిక వేత్తలు,ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తారని సర్కారు అంచనా వేసింది.
వృద్ధికి కూడా..
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా.. పీ-4 ప్రధానంగా దోహద పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. `స్వర్ణ ఆంధ్ర విజన్-2047`లో భాగంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటును సాధించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో గ్రామ, మండల, నియోజకవర్గం, జల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. వీరు ఆయా ప్రాంతాలలో పర్యటించి.. ప్రజల అవసరాలు.. వారిని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిని కూడా తెలుసుకుంటారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మరింత మెరుగులు దిద్దేందుకు కూడా అవకాశం ఉంటుందని, నిజమైన లబ్ధి దారులకు ఫలాలు అందుతాయని కూడా.. సర్కారు అంచ నా వేస్తోంది. ఇక, పీ-4 ద్వారా రాష్ట్ర స్థాయి రహదారులపై `టోల్ గేట్లు` పెట్టనున్నారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు కూడా పీ-4ను అమలు చేయనున్నారు. తద్వారా ఆయా ప్రాజెక్టుల విషయంలో బాధ్యతాయుత నిర్వహణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.