ఏపీకి మరో రెండు తీవ్ర అల్పపీడనాలు
గతానికి భిన్నంగా ఈ ఏడాదిని ఏపీని వాతావరణ మార్పులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి.
గతానికి భిన్నంగా ఈ ఏడాదిని ఏపీని వాతావరణ మార్పులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చి పడుతున్న అల్పపీడనాలు ఏపీని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. మరో పదకొండు రోజుల్లో 2024 ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ లోపు మరో రెండు అల్పపీడనాలు ఖాయమన్న మాటను వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు తీవ్ర అల్పపీడనాల్లో ఒకటి ఇప్పటికే కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. అల్పపీడనం కాస్తా బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ.. ఉత్తర తమిళనాడు.. దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనున్నట్లుగా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఈ తీవ్ర అల్ప పీడనం వాయువ్య దిశగా పయనిస్తూ.. ఉత్తర తమిళనాడు.. దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ.. తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..
విజయనగరం
విశాఖపట్నం
అనకాపల్లి
కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక.. శ్రీకాకుళం.. అల్లూరి సీతారామరాజు.. కోనసీమ.. నెల్లూరు.. తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ చెబుతోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీవ్ర అల్పపీడనం కారణంగా తీరం వెంట గరిష్ఠంగా 55కి.మీ. వేగంతో గాలులు తీస్తాయని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.
ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక వైచిత్రి నెలకొంది. సాధారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో.. తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలోనూ దాటుతున్న విషయాన్ని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో మరో అల్పపీడనం దూసుకురానున్నట్లుగా ఐరాపా వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ అల్పపీడనం అండమాన్ సమీపంలో ఏర్పడనున్నట్లుగా పేర్కొన్నారు. ఏడాది చివర్లో వస్తునన ఈ అల్పపీడనాల తీవ్రత ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.