ఏపీలో రానున్న 3 రోజులు .. తెలుగోళ్లు కాస్త జాగ్రత్త
అంతేకాదు.. వర్షాలు కురిసే ఈ సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లి నిలుచోవద్దన్న హెచ్చరికలు చేస్తున్నారు.;

మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలాంటి వేళ.. ఒక చల్లటి కబురు తీసుకొచ్చింది వాతావరణ సంస్థ. రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించారు. రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సాధారణంగా వేసవిలో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. ఒకవేళ.. వర్షాలు పడితే.. ఆ తర్వాత ఎండల తీవ్రత మరింత పెరగటమే కాదు.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. జనాలకు చుక్కలు చూపించే పరిస్థితి. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు వర్షాలు.. ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలువురు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాగే నీరు.. తీసుకునే ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు.. వర్షాలు కురిసే ఈ సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లి నిలుచోవద్దన్న హెచ్చరికలు చేస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో.. చెట్ల కిందకు వెళ్లి నిలబడే పనులు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. మంగళవారం శ్రీకాకుళం.. విజయనగరం.. పార్వాతీపురం మన్యం.. అల్లూరి సీతారామరాజు.. అనకాపల్లి.. కాకినాడ.. ప్రకాశం.. నంద్యాల.. అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఏపీ పరిస్థితి ఇళా ఉంటే తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పలు జిల్లాల్లో గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. అదే సమయంలో సాధారణం కంటే రెండు.. మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండ మంటలు.. ఆరోగ్యం విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.