'అ- అమరావతి, ఆ-ఆదర్శ ఆంధ్ర'... పాఠ్యాంశాల్లో చేరిక!
అయితే.. ఈ స్ఫూర్తిని చిన్నారుల నుంచి కూడా పెంచాలని భావిస్తోంది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారనున్న పాఠ్యాంశాల్లో కీలక అంశాలు చేర్చనుంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల్లో రాజధాని అమరావతి సెంటిమెంటు ను మరింత బలంగా నాటేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును అమరావతికి అనుకూలంగానే భావిస్తున్న ప్రభుత్వం.. రాజధాని పనులను వేగవంతం చేస్తోంది. అయితే.. ఈ స్ఫూర్తిని చిన్నారుల నుంచి కూడా పెంచాలని భావిస్తోంది. దీనిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారనున్న పాఠ్యాంశాల్లో కీలక అంశాలు చేర్చనుంది.
తొలి అడుగులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో 'అమరావతి'ని చేర్చనున్నారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు వివిధ రూపాల్లో ప్రతి తరగతిలోనూ అమరావతిని పాఠ్యాంశంగా మారిస్తే బాగుంటుందన్న మంత్రుల సూచనలకు చంద్రబాబు ప్రాథమికంగా ఓకే చెప్పారు. దీని ప్రకారం.. 1వ తరగతిలో నేర్చుకునే అ, ఆలలో తొలి రెండు అక్షరాలను రాజధాని, రాష్ట్రం గురించి చెప్పనున్నారు. అ-అంటే ఇప్పటి వరకు అమ్మ అని ఉండేది. అయితే.. దీనిని అలానే ఉంచి.. రెండో పదం కూడా నేర్పించనున్నారు.
అ-అంటే 'అమరావతి'గా పిల్లలకు నేర్పించనున్నారు. ఇక, ఆ- అంటే.. ప్రస్తుతం 'ఆవు' అని ఉంది. దీనిని తీసేసి.. 'ఆ- అంటే ఆదర్శ ఆంధ్ర'గా పాఠాలలో చేర్చనున్నారు. ఇక, రెండో తరగతిలో ప్రాథమిక అంశాల్లో అమరావతిని పాఠ్యాంశంగా చేరుస్తారు. 3వ తరగతిలో మరిన్ని విషయాలు జోడించి పాఠాలు బోధిస్తారు. 4వ తరగతిలో మోతాదు పెరగనుంది. ఇక, 5వ తరగతి సోషల్ పుస్తకంలో అమరావతి గురించి మరింత విస్తృతంగా.. రాజధానిగా ఎంచుకున్న తీరును నేర్పిస్తారు.
6వ తరగతికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో అమరావతికి సంబంధించిన పాఠం ఉండనుంది. ఈ మేరకు విద్యావేత్తలకు ఆయా పాఠ్యాంశాలను రూపొందించే బాధ్యతను అప్పగించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ మేరకు ప్రాథమిక విద్యలో మార్పులు చేయనున్నారు. దీనివల్ల చిన్న వయసు నుంచే రాజధానిపై అవగాహన ఏర్పడడంతోపాటు.. రాజధాని ప్రాధాన్యం.. ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాలను కూడా వివరించనున్నారు.