అన్న క్యాంటీన్ల సంబరం... విరాళాల అంబరం!
తొలుత అన్న క్యాంటీన్‌కు సీఎం చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి.. మంత్రి నారాయణకు అందించారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం గురువారం(ఆగస్టు 15) నుంచి ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. పేదలకు మూడు పూటలా కడుపు నింపాలన్న ఉద్దేశంతో 2014-19 మధ్య 230 క్యాంటీన్లతో అమలైన ఈ కార్యక్ర మం.. పేదలకు రూ.5కే కడుపు నింపింది. రాష్ట్రంలోని పలురద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం, రాత్రి భోజనాలు అందించారు. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని నిలిపి వేసింది. తర్వాత కాలంలో మరింత వన్నెలతో తిరిగి తెరుస్తామని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు.. తాము తిరిగి అధికారంలోకి వస్తే.. అన్న క్యాంటీన్లు తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు.. పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేశారు. ప్రస్తుతం గురువారం గుడివాడలో అధికారికంగా ఒక్క క్యాంటీన్‌నే ప్రారంభిస్తున్నా.. మరుసటి రోజు నుంచి 99 క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. భూరి విరాళాలు సమర్పిస్తున్నారు.
తొలుత అన్న క్యాంటీన్‌కు సీఎం చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి.. మంత్రి నారాయణకు అందించారు. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా తమ తొలి నెల వేతనాన్ని (రూ.3,30, 000) విరాళంగా అందించారు. అలానే ఎన్నారైలు కూడా అన్న క్యాంటీన్లకు విరాళాలు ప్రకటించారు. విద్యార్థులు సైతం తాము దాచుకున్న కిట్టీ బ్యాంకు సొమ్మును కూడా విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు.. అన్న క్యాంటీన్ కు ఆహారాన్ని అందిస్తున్న హరేకృష్ణ మూమెంట్ సంస్థకు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్‌కు సుమారు రూ.10 కోట్ల వరకు విరాళాల రూపంలో అందినట్టు తెలిసింది.