2019లో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి?
ఈ సమయంలో అసలు 2019 ఎన్నికల సమయంలో ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా చెప్పాయి అనేది ఒకసారి చూద్దాం..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేటితో జరిగే ఏడో విడత పోలింగ్ తో ముగియనుంది. దీంతో శనివారం సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో జూన్ 4న వచ్చే ఎగ్జాట్ పోల్స్ కంటే ముందు వస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రత్యేకంగా ఏపీలో అయితే ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ ఇప్పటికే పీక్స్ కు చేరుకున్న పరిస్థితి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకూ నమ్మొచ్చు? అనే ప్రశ్న కూడా మరోపక్క బలంగా వినిపిస్తుంది. ఈ సమయంలో 2019 ఎన్నికల సమయంలో ఏయే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏమేరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చాయి అనేది ఆసక్తిగా మారింది.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ రోజు సాయంత్రం 6:30 తర్వాత వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసలు 2019 ఎన్నికల సమయంలో ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా చెప్పాయి అనేది ఒకసారి చూద్దాం..!
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే...
ఇండియా టుడే: టీడీపీకి 37 - 40, వైసీపీకి 130 - 135
ఐ.ఎన్.ఎస్.ఎస్.: టీడీపీకి 118, వైసీపీకి 52
ఆరా మస్తాన్ సర్వే: టీడీపీకి 47, వైసీపీకి 126
పీపుల్స్ పల్స్: టీడీపీకి 59, వైసీపీకి 112
కేకే సర్వే: టీడీపీకి 30 - 35, వైసీపీకి 130 - 135
సీపీఎస్: టీడీపీకి 37-40, వైసీపీకి 133-135 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
అయితే అనంతరం వచ్చిన ఎగ్జాట్ ఫలితాల్లో వైసీపీకి 151 సీట్లు రాగా టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంటే... ఇండియా టుడే, సీపీఎస్, ఆర మస్తాన్, కేకే సర్వే, పీపుల్స్ పల్స్ సంస్థల అంచలాను దాదాపు దగ్గరకు రాగా... ఐ.ఎన్.ఎస్.ఎస్. సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఆల్ మోస్ట్ రివర్స్ లో వెల్లడైన పరిస్థితి!
2019 ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే...
టైమ్స్ నౌ – వీఎంఆర్: వైసీపీకి 18, టీడీపీకి 7
ఇండియా టుడే యాక్సిస్: వైసీపీకి 18-20, టీడీపీకి 2-6
సీ.ఎన్.ఎన్. న్యూస్ 18: వైసీపీకి 13-14, టీడీపీకి 10-12
టుడేస్ చాణక్య: వైసీపీకి 8, టీడీపీకి 17
ఆరా మస్తాన్ సర్వే: వైసీపీకి 20 - 24, టీడీపీకి 1 - 5
రిపబ్లిక్ – జన్ కీ బాత్: వైసీపీకి 8 - 12, టీడీపీకి 13 - 16
రిపబ్లిక్ - సి ఓటర్: వైసీపీకి 11, టీడీపీకి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
అయితే వాస్తవ ఫలితాల విషయానికొస్తే వైసీపీకి 22, టీడీపీకి 3 ఎంపీ స్థానాలు వచ్చాయి. అంటే... ఆరా మాస్తాన్, ఇండియా టుడే, టైమ్స్ నౌ ల ఎగ్జిట్ పోల్స్.. వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చాయన్నమాట.
కాగా... జూన్ ఒకటో తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని ఈసీ పేర్కొంది. మరి నేటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి!