జగన్, చంద్రబాబు, పవన్‌.. కలవరమామే మదిలో!

ఇలా వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు జగన్, చంద్రబాబు, పవన్‌ లు మనసులో కలవరపడుతున్నారని అంటున్నారు.

Update: 2024-03-30 16:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ ఉరకలేస్తోంది. మరోవైపు కూటమిగా వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ 2014 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో హోరాహోరీగా ఎన్నికల్లో తలపడుతున్నాయి, ఇప్పటికే ఒక్క జనసేన పార్టీ తప్ప అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి, జనసేన పార్టీ మరో మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల అధినేతలు.. జగన్, పవన్, చంద్రబాబు కలవరపడుతున్నారని టాక్‌ నడుస్తోంది. ముందుగా వైసీపీ అధినేత జగన్‌ ను తీసుకుంటే ఆయన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం టెన్షన్‌ పెడుతోందని టాక్‌ నడుస్తోంది. స్వయంగా జగన్‌ చెల్లెళ్లు వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీత ఇద్దరూ జగన్‌ వైపే వేలెత్తి చూపుతున్నారు. హత్య చేసిన నిందితులను జగన్‌ కాపాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.

వైఎస్‌ వివేకా హత్యకు తోడు ఈ ఐదేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లో వివిధ పథకాల కింద డబ్బులు వేయడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా లేదనేది ప్రధానంగా వినిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు, పేరున్న కంపెనీల స్థాపన, రాజధాని ఏదో ఇప్పటికీ తేలకపోవడం, పోలవరం పూర్తికాకపోవడం, ప్రత్యేక హోదా గాల్లో కలవడం వంటివి తమ పార్టీకి ఎంతవరకు డ్యామేజీ చేస్తాయోనని జగన్‌ కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలనే పూర్తిగా నమ్ముకుని జగన్‌ ఎన్నికల బరిలో ఉన్నారని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలోకి రాకపోతే కూటమి అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే జగన్‌ ను లక్ష్యంగా చేసుకోవచ్చని అంటున్నారు. జగన్‌ తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలందరినీ వివిధ కేసుల కింద ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేస్తున్నట్టే జైలులో వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రాకపోతే టీడీపీ మరింత పతనావస్థకు చేరొచ్చనే భయం ఆయనకు ఉందని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ లతోపాటు టీడీపీ ముఖ్య నేతలందరిపైనా జగన్‌ ప్రభుత్వం కేసులు పెట్టింది. చంద్రబాబును 53 రోజులపాటు జైలుపాలు చేసింది. టీడీపీ అధికారంలోకి రాకపోతే జగన్‌ అధికారంలోకి వస్తే ఈ కేసుల తీవ్రత మరింత పెరగడంతోపాటు టీడీపీని పూర్తిగా అణచివేస్తారని చంద్రబాబు భయపడుతున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్లు రానివారంతా కారాలు మిరియాలు నూరుతున్నారు. అసంతృప్త టీడీపీ నేతలు... వైసీపీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోతే వయసు రీత్యా ఆయన అంత చురుగ్గా వ్యవహరించలేరని అంటున్నారు. మరోవైపు లోకేశ్‌ నాయకత్వ లక్షణాలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బయటపడకపోవడం కూడా చంద్రబాబు ఆందోళనకు కారణమంటున్నారు.

ఇక జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు కూడా ఈ ఎన్నికలు చావో రేవో అని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గానూ ఒకే ఒక్క అసెంబ్లీ సీటులో మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. కూటమి ఏర్పాటు కోసం తానే నాలుగు అడుగులు వెనక్కి తగ్గారు. సీట్లను తగ్గించుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తిట్టిపోస్తున్నా వెనుకంజ వేయలేదు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాకపోయినా, కనీసం జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో మెరుగైన ఫలితాలు రాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల నుంచి అదృశ్యమయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఇప్పటికే పవన్‌ వ్యవహారశైలి నచ్చక పలువురు పార్టీ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. పవన్‌ కళ్యాణ్‌ తోపాటు జనసేన అభ్యర్థులందరినీ ఓడిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన మెరుగైన ఫలితాలు సాధించకపోతే ఆ పార్టీలో నేతలెవరూ మిగలరని.. వేరే పార్టీలను వెతుక్కుంటారని టాక్‌ నడుస్తోంది. దీంతో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ లోనూ ఆందోళన కనిపిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో గెలుపుపై ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇలా వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు జగన్, చంద్రబాబు, పవన్‌ లు మనసులో కలవరపడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News