పులివెందుల ఎమ్మెల్యేకి హోంమంత్రి అనిత సవాల్!
అవును.. ఏపీలో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు.
పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త అని చెబుతున్న రషీద్ ని జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ హత్య అంటూ హడావిడి చేశారు. అయితే.. పోలీసులు మాత్రం ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యగా తేల్చారు!
ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. వినుకొండకు వెళ్లి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... కూటమి అధికారంలోకి వచ్చిన సుమారు నెలన్నర రోజుల్లోనే 36 హత్యలు జరిగాయని అన్నారు.
ఈ నేపథ్యంలో... ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఇదే సమయంలో.. ఏపీలో జరుగుతున్న దారుణాలపై ఈ నెల 24న ఢిల్లీలో నిరసన తెలుపుతామని వెళ్లడించారు. ఏపీలో భయానక వాతావరణం నెలకొందని అన్నారు. ఈ సమయంలో... ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. ఈ సందర్భంగా జగన్ కు సవాల్ చేశారు.
అవును.. ఏపీలో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇందులో భాగంగా... జగన్ ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని అన్నారు. ఇదే సమయంలో... వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో శాంతి భద్రతలు, తమ పాలనలో శాంతిభద్రతలపై చర్చించేందుకు తాను వస్తానని సవాల్ విసిరారు. ఇదే సమయంలో... అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయనే ఆయన మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు. ఇదే క్రమంలో... ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం ప్రవేశపెట్టనుందని తెలిపారు.
అందువల్ల.. ధమ్ముంటే జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని.. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీ చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని సూచించారు. ఇక, జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగితే... ఆ వివరాలు బయటపెట్టాలని అనిత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన హత్యలపై వివరణ ఇచ్చారు.
ఇందులో భాగంగా.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని.. అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ వారేనని అనిత వెల్లడించారు.