రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటే.. వైసీపీ నేతలు ఎవరూ మిగలరు!
కూటమి పాలనలో కక్ష సాధింపులకు స్థానం లేదని చెబుతూనే పోసాని అరెస్టుపై హోంమంత్రి సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి అరెస్టుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తొలిసారిగా స్పందించారు. అదీ ముఖ్యంగా పోసాని విమర్శలకు వైసీపీలోని ఓ కీలక నేత స్క్రిప్టు ఇచ్చారని రిమాండు రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారనే విషయం వెలుగు చూసిన తర్వాత హోంమంత్రి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రం మొత్తం మీద పోసానిపై 17 కేసులు నమోదయ్యాయని, తప్పు చేశారని తేలిన తర్వాతే అరెస్టు చేశామన్నారు. కూటమి పాలనలో కక్ష సాధింపులకు స్థానం లేదని చెబుతూనే పోసాని అరెస్టుపై హోంమంత్రి సంచలన కామెంట్స్ చేశారు.
అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడులో పాల్గొనేందుకు హోంమంత్రి వచ్చారు. ఆ కార్యక్రమం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై ఘాటు విమర్శలు చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టమని, తప్పుడు పనులు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని హోంమంత్రి స్పష్టం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని ఆమె తేల్చిచెప్పారు.
సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి వైసీపీ నేత హోదాలో అత్యంత దారుణంగా మాట్లాడినందునే కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పోసానిని సమర్థించేవారు ఒక్కరైనా ఉన్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం కోసం మాట్లాడుతున్నారని, అయితే ఆయన ముందుగా వైసీపీలో జరిగే అంతర్యుద్ధంపై ఆలోచించుకోవాలని సూచించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్ ను హెచ్చరిస్తున్నా, నోటికొచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వమని గుర్తించుకోవాలన్నారు. ఏది పడితే అది మాట్లాడతామంటే తాము సహించమని వ్యాఖ్యానించారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపైనా హోంమంత్రి అనిత స్పందించారు. తాము రెడ్ బుక్ ప్రకారం నడుకుంటే వైసీపీ నేతలు ఎవరూ రోడ్లపై తిరగలేరన్నారు.