తాజ్ మహల్ లో గంగాజలంతో అభిషేకం వివాదాస్పదం
ఈ క్రమంలోనే తాజాగా తాజ్‌మహల్ లోపల గంగా జలంతో అభిషేకం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన వైనం వైరల్ గా మారింది.
తాజ్ మహల్...తన భార్య ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా షాజహాన్ కట్టించిన ప్రేమ సౌధం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కట్టడం గత కొద్ది సంవత్సరాలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదని, అది తేజో మహల్ అనే శివాలయం అని కొందరు హిందుత్వవాదులు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. అక్కడ పూజలు, అభిషేకాల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక, తాజ్ మహల్ లో కొన్ని గదులకు తాళాలు వేసి ఉన్నాయని, వాటిలోకి ఎవరిని అనుమతించరని, ఆ గదుల్లో శివలింగాలు, శివుడి ప్రతిమలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తాజ్‌మహల్ లోపల గంగా జలంతో అభిషేకం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించిన వైనం వైరల్ గా మారింది. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారంనాడు పర్యాటకులుగా తాజ్ మహల్‌లోకి ప్రవేశించారు. తమ వెంట వాటర్ బాటిల్‌లో గంగా జలాన్ని తెచ్చుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా శివుడికి అభిషేకం నిర్వహిస్తున్నామన్న భావనతో షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న నేలమాళిగకు దారితీసే మూసి ఉన్న మెట్లపై గంగా జలాన్ని పోశాడు. ఆ మెట్ల వద్ద ఓం పేరుతో స్టిక్కర్ ఉంది గనకే గంగా జలంతో అక్కడ అభిషేకం చేశానని చెబుతున్నాడు.
ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారి చేసిన పనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి తెలిపారు.