కాదంబరి.. ఇప్పుడు వెలుగులోకి మరో సంచలన కేసు!
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక పారిశ్రామికవేత్త కోసం బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధించారనే ఆరోపణలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక పారిశ్రామికవేత్త కోసం బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధించారనే ఆరోపణలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు పోలీసు అధికారులు నిబంధనలు మీరి వ్యవహరించారని.. వైసీపీ పెద్దలు చేయమందల్లా చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, తదితరులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పై తాను వేసిన కేసును ఉపసంహరించుకునేలా చేయడానికి తనపై వెసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో అక్రమ కేసు వేయించారని కాదంబరి జత్వానీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ ను ఇటీవల డెహ్రాడూన్ లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టు అతడికి రిమాండ్ విధించింది.
ప్రస్తుతం ఈ కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. కాగా కాదంబరి కేసులో మరో వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నారు. నాటి వైసీపీ పెద్దల మెప్పు కోసం కాదంబరిపై పోలీసులు మరో తప్పుడు కేసు నమోదు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీ నుంచి 14 వరకు కోర్టు కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా జత్వానీ ఉపయోగించే ఐ ఫోన్లను తెరిచేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అప్పటికే వాటిని నాటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెరిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఆమెతో ఐ ఫోన్లను తెరిపించేందుకు పీఎస్సార్ ఆంజనేయుల ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ప్రయత్నించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఫోన్లను తెరిచేందుకు కాదంబరి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్ ఓపెన్ చేస్తుందని కాంతిరాణా, విశాల్ గున్నీలకు కుక్కల విద్యాసాగర్ సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత విద్యాసాగర్ సలహా మేరకు.. ఐపీఎస్ అధికారి కాంతిరాణా ఓ ప్రణాళికను అమల్లో పెట్టారని మీడియా కథనాలు నివేదించాయి. ఇందులో భాగంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ స్పా సెంటర్ పై పోలీసులతో దాడి చేయించారు. ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను ఏ1గా చేర్చి కేసు పెట్టారు. ఇదే కేసులో ఏ2గా.. కాదంబరికి సన్నిహితుడైన అమిత్ కుమార్ సింగ్ ను చేర్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతడిపై ఢిల్లీ నుంచి విజయవాడకు మహిళలను సరఫరా చేస్తున్నట్టు కేసు నమోదు చేశారు.
ఈ తప్పుడు కేసుతో కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ ను అరెస్టు చేసేందుకు నలుగురు సభ్యుల పోలీసుల బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ పోలీసు బృందం ఢిల్లీ వెళ్లేందుకు నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా కార్యాలయం నుంచి విమాన టికెట్లు బుక్ చేసినట్టు భోగట్టా.
అయితే ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదని మీడియా కథనాలు నివేదించాయి. ఈలోగా కాదంబరి, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి.