ఏపీ బీజేపీ ఎమ్మెల్యే నోట.. '10 సార్లు ఆత్మహత్య' మాట!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి.

Update: 2024-11-16 10:57 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేకపోవడంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతున్నట్లు అనిపించినా.. కొన్ని ఆసక్తికర పరిణామాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి! ఇందులో భాగంగా.. వరుసగా రెండు రోజుల నుంచి తన కష్టాలను ఏకరువు పెడుతున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన కీలకంగా మారిందని అంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ప్రతిపక్ష పార్టీల నేతల కష్టాలతో పాటు కాంట్రాక్టర్ల కష్టాలను తెరపైకి తెచ్చారు విష్ణుకుమార్ రాజు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తన స్థానంలో ఉన్న వ్యక్తి పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని.. కాకపోతే తన గుండెకు ధైర్యం ఎక్కువని చెప్పుకొచ్చారు.

అవును... ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు ఎన్నికైన సందర్భంగా... ఆయనను అభినందిస్తూ శాసనసభలో మాట్లాడిన బీజేపీకి చెందిన విశాఖ (ఉత్తరం) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఆర్ పై రాజద్రోహం కేసు, తదనంతర పరిణామాలను ప్రస్థావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఎన్నికల సమయంలో విశాఖలో ఓ ఎమ్మెల్యేను విమర్శించినందుకు తనపైనా కేసులు పెట్టారని.. తాను కుండబద్దలు కొట్టేలా మాట్లాడే మనిషినని, భారతీయ జనతాపార్టీలో ఉన్నందుకు తప్పించుకోగలిగానని.. లేకుంటే రఘురామకృష్ణంరాజుకు ఇచ్చిన ట్రీట్ మెంట్ తనకూ తప్పేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన కష్టాలు చెప్పుకున్నారు. టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా స్పందించిన విష్ణు కుమార్ రాజు... వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేశారని అన్నారు. ఈ క్రమంలో... ఓ కాంట్రాక్టర్ గా తనకు రావాల్సిన బకాయిలే రూ.87 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆ పరిస్థితుల్లో తన లాంటి వ్యక్తి పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని.. కాకపొతే, తన గుండెకు ధైర్యం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదని చెప్పుకొచ్చారు విష్ణుకుమార్ రాజు. ఇదే సమయంలో... జగన్ చాలా రకాలుగా కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టారని తెలిపారు.

Tags:    

Similar News