ఏపీ బడ్జెట్ పై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన కూటమి సర్కార్

నవంబరు రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆర్థిక వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సిద్ధమవుతున్నారు.

Update: 2024-10-18 04:22 GMT

అధికార బదిలీ జరిగిన వేళ.. అందుకు తగ్గట్లు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణలో గత ఏడాది చివర్లో ఎన్నికలు జరిగితే.. ఏపీలో ఈ ఏడాది జూన్ లో ఎన్నికలు జరగటం.. ఫలితాలు రావటం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువు తీరింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలో కూటమి సర్కారు కాస్త ఆలస్యం చేసింది. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలు.. అనుసరించిన పద్దతులపై అవగాహన పెంచుకోవటానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుందన్న మాట వినిపిస్తోంది.

ఎట్టకేలకు కూటమి సర్కారుతన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. నవంబరు రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆర్థిక వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు మూడు తేదీలు అనుకుంటున్నప్పటికీ.. ఫైనల్ డేట్ ఇంకా ఖారారు కాలేదని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాటి జగన్ సర్కారు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను సమర్పించిన సంగతి తెలిసిందే.

రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ ను సమర్పించగా.. 2024 ఏప్రిల్ నుంచి జులై 3 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు అసెంబ్లీ ఆమోదంతీసుకున్నారు. జూన్ లో కొత్త సర్కారు కొలువు తీరింది. జులైలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం.. అప్పులు ఎన్ని ఉన్నాయన్న విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొని ఉండటంతో.. పూర్తి వివరాలు రాబట్టేందుకు సమయం పట్టింది. మొత్తంగా 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచింది.ఈ నేపథ్యంలో నవంబరు రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు.

చివరి నాలుగు నెలలకాలానికి బడ్జెట్ ఖర్చులకు ఆమోదం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఏడాది మొత్తానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సిందే. దాదాపు రూ.2.90 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉండొచ్చని భావిస్తున్నారు. అమరావతి రాజధాని.. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో పెద్ద పీట వేయనున్నారు. రహదారుల నిర్మాణం.. రిపేర్లు.. సూపర్ సిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాలనలో అనుభవం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు ఆర్నెల్ల తర్వాత కానీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే పరిస్థితి ఉండటం ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన వివరణ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తారన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News