అప్పులు చేయాల్సిందే...కుండబద్ధలు కొట్టిన పయ్యావుల!
మరి రెవిన్యూకు ఖర్చులకు మధ్య తేడా ఎలా భర్తీ చేస్తారు అని ఇప్పటికే విపక్షాలు కూటమి బడ్జెట్ మీద ప్రశ్నల వర్షం కురిపించాయి.;
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మూడు లక్షల 22 వేల పై చిలుకు భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ చూస్తే ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందింది సంపద చాలా ఉంది అని అంతా అనుకుంటారు. అయితే లక్ష కోట్ల భారీ లోటు ఉంది. మరి రెవిన్యూకు ఖర్చులకు మధ్య తేడా ఎలా భర్తీ చేస్తారు అని ఇప్పటికే విపక్షాలు కూటమి బడ్జెట్ మీద ప్రశ్నల వర్షం కురిపించాయి.
దానికి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కుండబద్ధలు కొట్టారు. ఆయన ఏపీ ఆర్ధిక పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ఏపీకి ఎంత ఆదాయం వస్తుంది. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం, గ్రాంట్లు ఎంత ఇక ఏపీకి ఉన్న అప్పులు వాటి మీద వడ్డీలు ఆ మీదట జీతభత్యాలు ఇలా ఖర్చులు ఎంత తడిసి మోపెడు అవుతుందో కూడా వివరించే ప్రయత్నం చేశారు.
ఏపీకి వచ్చే ఆదాయం కేంద్రం నుంచి వచ్చే అన్నింటితో కలుపుకుని అక్షరాలా ఒక లక్షా 54 వేల 65 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఇద్నులో రాష్ట్రం చేసిన అప్పులు వాటికి కట్టాల్సిన వడ్డీలు అన్నీ కలపి చెల్లించాల్సింది ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు అందరికీ కలుపుకుని 65 వేల 962 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇలా ఈ రెండింటినీ కలిపితే లెక్క దాదాపుగా ఒక లక్షా ముప్పయి కోట్ల రూపాయలుగా ఉంది.
ఇక ఏపీలో సామాజిక పెన్షన్లు ఇవ్వాల్సి, మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. తల్లికి వందనం అమలు చేయాల్సి ఉంది. రైతులకు అన్నదాత సుఖీభవ పధకం కూడా అమలు చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు అమరావతికి పోలవరానికి నిధులు కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనులకు కూడా కేటాయింపులు చేయాల్సి ఉంది.
మరి ఇవన్నీ చేయాలి అంటే ఎక్కడ నుంచి నిధులు వస్తాయి అంటే అప్పులు చేయాల్సిందే అంటున్నారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్. వచ్చే ఆదాయం అలా అప్పులు వడ్డీలు జీత భత్యాలకే పోతుందని ఆయన చెబుతూంటే ఏపీలో దేనికి నిధులు కేటాయించాలని అడగగలమని అంటున్నారు.
ఇవన్నీ కూడా కాదు, అప్పుల మీద అప్పులు వాటి మీద వడ్డీలు ఇలా చేస్తూ పోతున్న ఏపీ పరిస్థితి ఆర్ధికంగా ఇబ్బందికరంగానే ఉందని నిపుణులు అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేయకతప్పడంలేదు. రానున్న అయిదేళ్ళలో ఈ అప్పులు కూడా పేరుకునిపోతాయి. వాటికి వడ్డీలు అన్నీ కూడా జమ అవుతాయి. ఇలా తీసుకుంటే 2029 నాటికి ఏపీ అప్పులు ఏక్నగా 18 లక్షల కోట్ల దాకా ఉంటాయని కూడా ఆర్ధిక నిపుణులు లెక్క వేస్తున్నారు.
అపుడు సంపద ఎంత సృష్టించినా ఈ అప్పులు వాటి వడ్డీలు తీర్చేయడం మాత్రం అసాధ్యమే అవుతుందని ఆ మీదట ఏపీ మరింత ఆర్ధికంగా ఇబ్బందిలో పడుతుందని అంటున్నారు. మరి ఏపీ ఇపుడు ఏమి చేయాలి అంటే చాలా ఖర్చులను కంట్రోల్ లో చేసుకోవాలి. అంతే కాదు సంక్షేమ పధకాలను కూడా నిలిపివేయాలని సూచిస్తున్నారు. కానీ రాజకీయంగా ఆలోచించే పాలకులు ఈ పని చేస్తరా అన్నదే పెద్ద డౌట్.