ఆర్‌ఆర్‌ఆర్ కేసు.. జగన్ విచారణకు వస్తారా?
ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ ఫిర్యాదులో గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును దేశద్రోహం కేసులో అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. స్వయంగా రఘురామనే ఈ ఆరోపణలు చేశారు. తనను పోలీసులు కొడుతూ ఆ వీడియోను సీఎం వైఎస్ జగన్ కు పంపారని ఆరోపించారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, రఘురామ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా ఉండటంతో తనను హింసించిన నాటి పోలీసులు, తనకు గాయాలు లేవంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, నాటి సీఎం వైఎస్ జగన్ పై ఇటీవల గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ ఫిర్యాదులో గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాటి సీఎం వైఎస్ జగన్, నాటి సీఐడీ డీజీ సునీల్ కుమార్, నాటి ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, తదితరులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో మరో నిందితుడిగా ఉన్న నాటి గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ కు సైతం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆయనకు నోటీసులను ఇంటికి పంపారు.
2019లో నరసాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు. తరచూ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తుండటంతో జగన్ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ పై రాజద్రోహం కింద కేసు నమోదు చేసింది.
ఈ క్రమంలో అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. తమ కస్టడీలోకి సీఐడీ పోలీసులు ఆయనను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ పిటిషన్ పై విచారణ చేస్తున్న పోలీసులు ఇవన్నీ తెలుసుకుంటున్నారని సమాచారం. హైదరాబాద్ లో ఆర్‌ఆర్‌ఆర్ ను అరెస్టు చేయడం, ఏపీకి తీసుకురావడం, పోలీస్ స్టేషన్ కు తరలించడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం, ఆ వీడియో తీసి జగన్ కు పంపడం.. ఇలా ప్రతి అంశంపైన కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. గత నెలలో రఘురామ గుంటూరు వచ్చి తన ఫిర్యాదును అందజేశారు. ఇప్పటికే పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు, విజయ పాల్ తోపాటు వైఎస్ జగన్ పైనా ఎఫ్‌ఆర్‌ఐ దాఖలైంది.
తనపై హత్యాయత్నం చేసినవారితోపాటు అందుకు ప్రోత్సహించినవారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించినవారిని కఠినంగా శిక్షించాలని రఘురామ తన ఫిర్యాదులో విన్నవించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు.