ఆరోసారి బాబే సీఎం...ఆశలు వదిలేసుకోవాల్సిందే !
చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యే నాటికి ఆయన వయసు నలభై అయిదేళ్ళు. ఆయన 2024 ఎన్నికలతో నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు.;

చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యే నాటికి ఆయన వయసు నలభై అయిదేళ్ళు. ఆయన 2024 ఎన్నికలతో నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి బాబు వయసు డెబ్బై అయిదేళ్ళు. అయితే బాబు మీద ఎంతో భారం ఉంది, మరెన్నో బాధ్యతలు ఉన్నాయి. బాబు విభజన ఏపీని ఒక గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. అంతే కాదు ఆయన ఏపీని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
ఇక ఏపీకి బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి వందేళ్ళ ఆంధ్రుల కల నెరవేర్చాలని పట్టుదలగా ఉన్నారు. ఏపీలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని అనుకుంటున్నారు. ఇలా బాబు ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. దాంతో ఆయన మరింత కాలం సీఎం గా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.
బాబు చూడని సీఎం పదవి కాదు. ఆయన 23 జిల్లాల ఉమ్మడి ఏపీకే తొమ్మిదేళ్ల పాటు సీఎం గా చేశారు. అలాంటిది విభజన ఏపీకి చిన్న రాష్ట్రానికి ఆయన సీఎం గా చేయడం అంటే అది ఆయనకు కాదు ఏపీకి లాభమని భావించే చాలా మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. జనసేన కూడా బాబు మరో పదిహేనేళ్ల పాటు సీఎం గా ఉండాలని కోరుకుంటుంది. బాబు విజనరీ అని అందుకే ఆయనకు మద్దతు ఇచ్చామని బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు.
రాజకీయాలు అధికారాలు పదవులు ముఖ్యం కాదు బాబు లాంటి సమర్ధ నాయకులు మరింత కాలం ఏపీకి సీఎం గా ఉంటేనే బాగుపడుతుందని జనసేన అధినేత హోల్ హార్టెడ్ గా మద్దతు ఇస్తున్నారు. ఏపీని బాగు చేసే సత్తా చంద్రబాబులో నిండా ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో బాబుకు మరింత కాలం సీఎం గా చేయాలని ఉందా లేదా అన్న ఆలోచనలతో సంబంధం లేకుండా ఆయనే సీఎం గా ఉండాలన్న ప్రజలు మేధావులు పార్టీల ఆకాంక్షలు గట్టిగా ఉన్నాయి.
ఇంకో వైపు చూస్తే కేవలం వీరే బాబు సీఎం గా పది కాలాలు ఉండాలని భావించడం లేదు. గ్రహాలు కూడా అదే చెబుతున్నాయి. గ్రహ బలం కూడా అలాగే ఉంది. బాబు సీఎం గా ఉండాల్సిందే అని ఆయనకు అనుకూల గ్రహాలు కోరుకుంటున్నారు. శ్రీ విశ్వావసు ఉగాది వేళ ఉగాది పంచాంగం లో కూడా అదే ఉంది. పంచాంగకర్తలు సైతం బాబుకు తిరుగులేదని ఎదురులేదని చాటి చెప్పారు.
పంచాంగ శ్రవణం చేసిన వారు ఎవరో కాదు ఘనాపాటి మహా అవధాని అయిన మాడుగుల నాగఫణి శర్మ. ఆయన మాట్లాడుతూ కాదు ఆరోసారి కూడా అవుతారని పంచాంగం సాక్షిగా జోస్యం చెప్పారు. దాంతో బాబును మెచ్చేవారు ఏపీ అభివృద్ధిని కాంక్షించేవారు అంతా కూడా ఆనందిస్తున్నారు.
ఆరోసారి బాబు సీఎం అంటే అది 2034లో జరుగుతుందన్న మాట. నంబర్ ప్రకారం చూస్తే 2029లో బాబు ఐదవసారి సీఎం అవుతారు. అలా మరో పదిహేనేళ్ళ పాటు అంటే 2039 దాకా బాబే కొనసాగుతారు అన్నది దీని భావం. అంటే బాబుకు 90 ఏళ్ళు నిండేంతవరకూ ఆయనే సీఎం దాదాపుగా తొంబై ఏళ్ళ వయసులో సైతం బాబు సీఎం గా ఉంటారు అని అంతా అంటున్నారు.
అదే నిజంగా జరిగితే మాత్రం బాబు సరికొత్త రికార్డులు బద్ధలు కొట్టినట్లే. ఈ రోజున 75 ఏళ్ళ వయసులో బాబు ఉన్నారు. కానీ ఆయనను చూస్తే వయసు అన్నది ఒక నంబర్ గానే తోస్తుంది. అంతటి ఫిట్ నెస్ బాబు సొంతం. ఇక బాబు అరో సారి సీఎం అంటే ఏపీ సీఎం సీటు అన్నది ఇప్పట్లో ఖాళీ అయ్యే చాన్స్ లేదని అర్థం అంటున్నారు. 2029 లో మాదే అధికారం అని వైసీపీ అనుకున్నా 2034లో కూడా వారికి సీటు దక్కదని పంచాంగం చెబుతోంది. గ్రహాలు అంత గట్టిగా బాబుకు అనుకూలిస్తున్నాయని అంటున్నారు.
ఇక నారా లోకేష్ కి సైతం 2039 ఎన్నికల తరువాతనే చాన్స్ అని అంటున్నారు. నారా లోకేష్ 2029లో సీఎం అని ఆయన అభిమానులు అనుకున్నా అది అసలు కుదరదని పంచాంగకర్తలు మాటలను బట్టి తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎటూ బాబు సీఎం గా పదిహేనేళ్ళు ఉండాలని ఆయన నుంచి చాలా నేర్చుకుంటామని అంటున్నారు.
కానీ తమ సామాజిక వర్గం వారు సీఎం కావాలని ఒక బలమైన సామాజిక వర్గం కోరుకుంటోంది. అలాగే పవన్ అభిమానులకు ఆయన సీఎం కోరిక నెరవేరాలి అంటే 2039 దాకా వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి పవన్ ఏ ముహూర్తాన బాబు మరో పదిహేనేళ్ల పాటు సీఎం అని అన్నారో తెలియదు కానీ గ్రహాలు కూడా తధాస్తు అని దీవిస్తున్నాయని అంటున్నారు.