జీవీ రెడ్డి హిట్ లిస్టు.. ఫైబర్ నెట్ లో ఏ క్షణమైనా ఊస్టింగులే..
ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన 200 మందిపై వేటు వేయాలని సంస్థ నూతన ఎండీ ప్రవీణ్ ఆదిత్య ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.;
ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన 200 మందిపై వేటు వేయాలని సంస్థ నూతన ఎండీ ప్రవీణ్ ఆదిత్య ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఫైబర్ నెట్ ఉద్యోగాలకు ఊస్టింగు ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సంస్థ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి తయారు చేసిన లిస్టును హిట్ లిస్టుగా తీసుకున్న ప్రభుత్వం కొత్త ఎండీ ప్రవీణ్ ఆదిత్య ద్వారా తొలగింపు ప్రక్రియను కొలిక్కి తేవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ లో వివాదానికి దారితీసిన ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం ముందడగు వేయనుందని సమాచారం. ఎలాంటి నియామక ప్రక్రియ లేకుండానే కనీసం నియామక ఉత్తర్వులు తీసుకోకుండానే ఫైబర్ నెట్ లో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారని గతంలో చైర్మన్ గా పనిచేసిన జీవీ రెడ్డి గుర్తించారు. సక్రమంగా లేని నియామకాలను రద్దు చేయాలని అప్పట్లో ఆయన ఆదేశించారు. అయితే ఆ అదేశాలను అమలు చేయకుండా గత మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ తొక్కిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జీవీ రెడ్డి బహిరంగంగా విమర్శలకు దిగడం, ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ఎండీ దినేశ్ కుమార్ పాటించడం లేదని చెప్పడంతో సర్కారు పెద్దల పరువు తీసేసినట్లైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇటు చైర్మన్ జీవీ రెడ్డితో రాజీనామా చేయించడమే కాకుండా ఎండీ దినేశ్ పై చర్యలు తీసుకుంది. అయితే జీవీ రెడ్డి ఆరోపణలలో వాస్తవాలను గ్రహించిన సర్కారు కొత్త ఎండీ ప్రవీణ్ ఆదిత్యకు స్పష్టమైన సూచనలు జారీ చేసిందని అంటున్నారు.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను స్వీకరించిన నూతన ఎండీ ప్రవీణ్ ఆదిత్య మాజీ చైర్మన్ జీవీ రెడ్డి రెడీ చేసిన లిస్టును షార్ట్ అవుట్ చేసినట్లు చెబుతున్నారు. జీవీ రెడ్డి 400 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తే.. ఎండీ ప్రవీణ్ ఆదిత్య మాత్రం ప్రస్తుతానికి 200 మందితో ఫస్ట్ లిస్టు రెడీ చేశారంటున్నారు. తాజాగా ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం 2014-19 మధ్యకాలంలో 119 మంది అవుట్ సోర్సింగ్, 12 మంది ఉండగా, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య భారీగా పెంచేశారని నివేదించారు. ఫైబర్ నెట్ సంస్థ నిర్వహణ బాధ్యతను టెరాసాఫ్ట్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించాక 495 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. 2019కి ముందు 119 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య 617కి పెరగగా, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 725కి పెరిగింది. ఇలా దాదాపు మొత్తం 1342 మంది ఉద్యోగులను నియమించగా, వీరిలో దాదాపు 80
శాతం మందికి ఎలాంటి నియామక పత్రాలు లేవని గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరిలో సగం మందిని తొలగించారు. ఉద్యోగుల జీతాల ఖర్చును నాలుగు కోట్ల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలకు తగ్గించారు. అయితే ఇప్పటికీ కొనసాగుతున్న ఉద్యోగుల్లో కొందరు నియామకాలు అక్రమమంటూ ఆరోపణలు వస్తుండటంతో ఎండీ ప్రవీణ్ ఆదిత్య విచారణ నిర్వహించారు. 200 మందిని తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి యువరాజుకు నివేదించినట్లు సమాచారం. దీంతో త్వరలో జీవీ రెడ్డి రెడీ చేసిన లిస్టు ప్రకారం ఊస్టింగులకు లిస్టు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.