ఉచిత ఇసుకపై.. పిల్లిమొగ్గలు రీజనేంటి?
ఈ క్రమంలోనే ఉచిత ఇసుక పాలసీని జూలైలోనే ప్రకటించి.. ఆగస్టు నుంచి అమలు చేశారు.
ఏపీలో ఇసుకను ఉచితంగా అందించడం ద్వారా.. భవన నిర్మాణ రంగాన్ని, తద్వారా రియల్ ఎస్టేట్ రం గాన్ని కూడా పరుగులు పెట్టించాలని కూటమి సర్కారు తలపోసింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అయితే.. రాబడి పెరుగుతుందని కూడా అంచనా వేసుకున్నారు. అదేవిధంగా పనులు లేక విలవిల్లాడుతున్న భవన నిర్మాణ రంగం కూలీలకు చేతి నిండా పని దొరుకుతుందని లెక్కలు వేసుకు న్నారు. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక పాలసీని జూలైలోనే ప్రకటించి.. ఆగస్టు నుంచి అమలు చేశారు.
అయితే.. రెండు మాసాలు గడిచిపోయినా.. ఈ పాలసీ విషయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ముందు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నవారికి ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. తర్వాత.. ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉచితమని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదని.. పేర్కొంది. కానీ, అన్నీ తర్వాత రోజుల్లో మార్చేసింది. దీనికి కారణం.. ఇసుకలోనూ సిండికేట్లు తయారయ్యారు. దీంతో ఎవరికీ ఏదీ ఉచితంగా అందని పరిస్థితి ఏర్పడింది.
ఇక, ఆ తర్వాత తమ్ముళ్ల ప్రమేయం పెరిగిపోయింది. దీంతో వైసీపీ హయాం కన్నాకూడా ఎక్కువగానే ఇసుక ధరలు ఉన్నాయంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. దీనిని వైసీపీపై నెట్టేసేందుకు అవకాశం లేని విధంగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీంతో ఇలా ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాలని సీఎం చంద్రబాబే ఆదేశించారు. చివరకు ఇలా సోషల్ మీడియాలో పన్రచారం చేస్తున్నది తమ్ముళ్లేనని గుర్తించారు. దీంతో దానిని వెనక్కి తీసుకున్నారు.
ఇక, ఇప్పుడు సీనరేజీ రద్దు చేశారు. జీఎస్టీ రద్దు చేశారు. కేవలం ఇసుక రవాణాకు మాత్రమే డబ్బులు తీసుకుంటామని చెప్పారు. అది కూడా.. సమీపంలోని వారు.. ఉచితంగా తీసుకువెళ్ల వచ్చన్నారు. ఇక, వాగులు , వంకల్లో ఇసుకను ఎలా తీసుకువెళ్లినా.. అభ్యంతరం లేదని చెబుతున్నారు. కానీ, ఇలా రోజుకొక నిర్ణయం.. రోజుకొక ఆదేశంతో ఉచిత ఇసుక విషయంలో సర్కారు వేస్తున్న పిల్లిమొగ్గలు.. ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరో వైపు తమ్ముళ్లు కూడా ఆగడం లేదు. వీరిని నియంత్రించలేక.. అటు ప్రజలను సముదాయించలేక సర్కారు తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.