జగన్ రాకముందే ఆ పధకం జనాలకు !
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక పధకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక పధకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ పధకం కనుక అమలు చేస్తే దాదాపుగా అరవై లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. దాంతో కూటమి ప్రభుత్వ పెద్దలు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
ఏపీలో రైతన్నలు అరవై లక్షల దాకా ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ పేరుతో పధకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. ఎన్నికల ముందు ఈ పధకం అమలు చేస్తామని కూటమి పెద్దలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి అయినా పధకం అమలు చేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి.
అన్నదాతా సుఖీభవత పధకం కింద ఒక్కో రైతుకూ ఇరవై వేల రూపాయలు భరోసా కింద సాయం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దీనికి కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ పధకం కింద నిధులతో కలిపి ఇవ్వాలని చూస్తోంది.
ఇకపోతే ఈ ఏడాది పీఎం కిసాన్ పధకం తొలి విడత మొత్తం రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయడానికి నిర్ణయించింది. దాంతో అదే నెలలో అన్నదాతా సుఖీభవ మొత్తాన్ని కూడా కలిపి రిలీజ్ చేయడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అని అంటున్నారు.
వచ్చేది ఖరీఫ్ సీజన్ కాబట్టి రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. దాంతో పాటుగా రైతులలో ఉన్న అసంతృప్తి కూడా పోతుందని అదే సమయంలో విపక్షాలు చేసే ప్రచారం కూడా వీగిపోతుందని భావిస్తోంది. నిజానికి చూస్తే జగన్ ఫిబ్రవరి నెలలో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారని అంటున్నారు.
ఆయన ఎక్కువగా సూపర్ సిక్స్ పధకాల మీదనే ఫోకస్ పెడుతున్నారు. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేయడంలేదని కూడా పార్టీ మీటింగులలో జగన్ చెబుతున్నారు. దాంతో గడప దాటి బయటకు జగన్ వెళ్లకముందే అన్నదాత పధకాన్ని అమలు చేయడం ద్వారా ఆ వర్గం వైసీపీ వైపు కనీసంగా కూడా చూడకుండా పకడ్బందీ ఎత్తుగడలనే కూటమి ప్రభుత్వం వేస్తోంది అని అంటున్నారు.
ఇక ఈ పధకం అమలు అయితే పెద్ద సంఖ్యలో ఉన్న రైతాంగం పూర్తిగా కూటమి పక్షాన ఉంటారని కూడా భావిస్తున్నారు. మరో వైపు చూస్తే తల్లికి వందనం పధకం విషయంలోనూ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి 2025-2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అప్పటికి తల్లికి వందనం పధకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది అని అంటున్నారు.
ఈ పధకం కోసం ఏకంగా 12 వేల నుంచి 14 వేల కోట్ల దాకా నిధులు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ పధకం కోసం అవసరమైన నిధులను సమీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఒక్కసారి కనుక పధకం అమలు అయితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా నిరాటంకంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
అందుకోసమే కాస్తా ఆలస్యం అయినా కచ్చితంగా చేయాలని చూస్తోంది. ఈ రెండు పధకాలు అమలు చేస్తే కనుక కూటమి సర్కార్ కి మెజారిటీ పాజిటివ్ ఫీలింగ్ జనాల నుంచి లభిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో రేపటి రోజున జగన్ కానీ మరొకరు కానీ జనంలోకి వచ్చి విమర్శలు చేయడానికి కూడా వీలు లేకుండా పోతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ రెండు పధకాల మీద కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు.