మిలీనియం టవర్లలోనే టీసీఎస్ క్యాంపస్
విశాఖ ఐటీకి ఊపు తెచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
విశాఖ ఐటీకి ఊపు తెచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. విశాఖ ఐటీ సెజ్ లో ఉన్న మిలీనియం టవర్లను ఐటీ కంపెనీలకు ఇవ్వడానికి వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019కు ముందు ఈ టవర్లలో ఐటీ కంపెనీలు ఉన్నా, ఆ తర్వాత వేరే చోటకు తరలిపోయాయి. ఇక ప్రస్తుతం ఈ భవనంలో కొన్ని అంతస్థులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ టవర్లను టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)కు లీజుకిచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
విశాఖలో పది వేల మందికి ఉద్యోగాలిచ్చేలా టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తామని రెండు నెలల క్రితం ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సొంత భవనం నిర్మించుకునే లోగా అనువైన భవనం ఉంటే తాత్కాలిక క్యాంపస్ తెరుస్తామని ఆ సంస్థ తెలిపింది. దేశంలో అతి పెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ విశాఖలో అడుగుపెడితే ఆ తర్వాత మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
రుషికొండ హిల్ నెంబర్ 3లో ఉన్న ఐటీ సెజ్ లో మిలీనియం టవర్లు ఉన్నాయి. వీటిని పూర్తిగా ఐటీ కంపెనీలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాంతం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్నందున ఐటీ కంపెనీలు ప్రారంభించే వారు వెనక్కి తగ్గుతున్నారని సమాచారం. తమకు స్పెషల్ ఎకనామిక్ జోన్ తో సంబంధం లేని భవనాలే కేటాయించాలని ఐటీ కంపెనీలు కోరుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖకు టీసీఎస్ తోపాటు చాలా కొత్త ఐటీ కంపెనీలు వస్తున్నందున వాటికి తగిన సౌకర్యాలు ఉన్న మిలీనియం టవర్లను కేటాయించేందుకు అనువుగా స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధి నుంచి రుషికొండ హిల్-3ని తప్పించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రుషికొండ హిల్ నెంబర్ 3పై రెండు టవర్లు ఉన్నాయి. 2014-2019 మధ్య నిర్మించిన ఈ టవర్లలో ఒకదాంట్లో కాండ్యయెంట్ కంపెనీకి కేటాయించారు. మొత్తం పది అంతస్థులు ఉన్న ఈ టవర్ లో నాలుగు అంతస్థుల్లో కాండ్యుయెంట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మిగిలిన ఆరు అంతస్థులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మరో టవర్ నిర్మాణం పూర్తయినా ఏ కంపెనీకి కేటాయించలేదు. దీంతో ఈ రెండు టవర్లలో అందుబాటులో ఉన్న స్పేస్ ను ఐటీ కంపెనీలకు ఇవ్వాలంటే ప్రతిబంధకంగా ఉన్న సెజ్ పరిధి నుంచి డీ నోటీఫై చేయాల్సివుంది. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఉత్తరాంధ్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.