రోడ్లన్నీ అవుట్ సోర్సింగ్ కే.. టోల్ తీస్తారు జాగ్రత్త !

ఏపీలో రోడ్లను బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చూస్తోంది.

Update: 2024-11-20 04:14 GMT

ఏపీలో రోడ్లను బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. వైసీపీ హయాంలో అయిదేళ్ల పాటు రోడ్లకు గుంతలు పడి అధ్వాన్నంగా మారాయి. ఈ రోడ్ల మీద ఎన్ని సెటైర్లు, ఎన్నెన్ని విమర్శలు ఎన్నెన్ని జోకులు అయినా రోడ్లు అలాగే ఉన్నాయి.

ఒక విధంగా కూటమి అధికారంలోకి రావడానికి వైసీపీ ఓటమికి పాడైన రోడ్లు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక వైసీపీ అదే గుంతల రోడ్లలో పడి ఓటమి పాలు అయింది, టీడీపీ కూటమి గెలిచింది. ఆరు నెలల పాలనతో ముందుకు సాగుతోంది.

ఇక కూటమి ప్రభుత్వంలో రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. మొత్తం రోడ్లను బాగు చేయించాలీ అంటే ఖజానాలో సొమ్ములు లేవు. దాంతో గుంతలు పూడ్చడానికి అన్నట్లుగా 850 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి.

అయితే ఇవి కూడా సరిపోవని అంటున్నారు. ఏపీ రోడ్లు గట్టిగా పది కాలాల పాటు ఉండాలంటే నిర్మించడమే మార్గం. దానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి. మరి అంత డబ్బు ప్రభుత్వం పెట్టలేదు. అందుకే చంద్రబాబు తన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో ఒక ప్రతిపాదన పెట్టారు.

ఏపీలోని రోడ్లను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇద్దామన్నది ఆ ప్రతిపాదన. ఆ విధంగా చేస్తే కనుక రోడ్లు బంగారంగా తయారు అవుతాయి. అయితే టోల్ ఫీజు చెల్లించాలి. కానీ ఇది కూడా కార్లు బస్సులు కార్లు వంటి వాహనాలే పరిమితం చేద్దామని బాబు ప్రతిపాదిస్తున్నారు. ఇక బైకులు ట్రక్కులు, ట్రాక్టర్లు ఆటోలకు టోల్ ఫీజు ఉండదని చెబుతున్నారు.

అంతే కాదు గ్రామాలలో మండలాలలో అసలు టోల్ ఫీజు అన్నదే ఉండదని మరో మినహాయింపు ఇచ్చారు చంద్రబాబు. ఇది పైలెట్ ప్రాజెక్ట్ గా గోదావరి జిల్లాల నుంచే స్టార్ట్ చేద్దామని ఆయన అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలను ఒప్పించాల్సింది ప్రజా ప్రతినిధులే అని బాబు అన్నారు. ఇది సమ్మతం కాకపోతే తనకేమీ అభ్యంతరం లేదు అని మళ్ళీ గుంతల రోడ్ల మీదనే తిరగాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.

ఇవన్నీ అసెంబ్లీలో బాబు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ చెప్పారు, ఇంతకంటే మంచి ఆలోచనలు ప్రతిపాదనలతో వచ్చినా సంతోషం అన్నారు. ఆలోచనలే అభివృద్ధికి నాంది పలుకుతాయని బాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే టోల్ ఫీజు అంటే ప్రజలలో అసహనం కనిపిస్తుంది అని అంటున్నారు.

బస్సులకు టోల్ ఫీజు వేసినా అందులో ప్రయాణించేది సామాన్యులే కదా అని అంటున్నారు. వారి టికెట్ మీదనే ఆ భారం పడుతుందని అంటున్నారు ఇక కార్లు ఈ రోజులలో మధ్యతరగతి వారికీ ఉన్నాయని చెబుతున్నారు. లారీలకు టోల్ ఫీజు పెడితే వారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు అని అంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా అన్నది ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం నేషనల్ హై వేలకు టెండర్లు పిలిచినట్లుగా ఏపీలోని రోడ్లకు కూడా పిలిచి అవుట్ సోర్సింగ్ కి అప్పగిస్తే బాగా ఉంటుంది అని అంటున్నారు. మరి కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కలసి ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News