ఫిబ్రవరి నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపు

ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

Update: 2024-12-31 07:17 GMT

ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఏ భూముల విలువ పెంచాలి? ఎక్కడెక్కడ తగ్గించాలి అనే విషయాలపై జనవరి 15వ తేదీకల్లా నివేదిక తెప్పించుకుంటామని, దాని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై తాడేపల్లిలోని రెవెన్యూ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుందని చెప్పిన మంత్రి, ఆదాయం పెంచుకోడానికి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు వివరించారు.

భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ఏరియాల్లోని భూముల ధరలను సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన రిజిస్ట్రేషన్‌ విలువల పెంచిందని, ఒక శాస్త్రీయ పద్ధతిని అనుసరించలేదని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్‌ విలువ అధికంగా ఉందని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. అటువంటి చోట్ల రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే తొలిసారి అవుతుందన్నారు. విలువలు పెరిగే చోట సగటున 15 % నుంచి 20 % వరకు పెంపుదల ఉంటుందని మంత్రి వివరించారు.

ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో ఒక్క సెప్టెంబరు మినహా మిగిలిన ఐదు నెలల్లో అదనపు ఆదాయం సమకూరినట్లు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్నరూ. 9,500 కోట్ల రాబడి లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం, గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను వేధించడమే పనిగా అప్పటి సీఎం జగన్ విధానాలు ఉండేవి. తమ ప్రభుత్వంలో రియల్ రంగాన్నిప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. భూ సమస్యలపై ఈ 6 నెలల్లో 1.70 లక్షల ఫిర్యదులు రాగా, అందులో 11 వేల సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News