ఏపీ రాజకీయం.. నాడు - నేడు : ఎవరి లాభం వారిదే ..!
గతంలో వైసీపీ ఉన్నప్పుడు అయినా.. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు అయినా.. అంతా సమానం!
రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా మిత్రులయ్యేది ఒక్క పంపకాల విషయంలోనే. ఎన్నికల వేళ పొట్లాడుకున్న కొట్టాడుకున్న నాయకులు కూడా.. ఏదైనా పంపకాల విషయానికి వస్తే మాత్రం గుట్టు చప్పుడు కాకుండా.. పంచేసుకుంటారు. ఈ తరహా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక్క మనదగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా కూడా అమలవుతోంది. దీనికి ఎవరూ అతీతులు కారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అయినా.. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు అయినా.. అంతా సమానం!
విశాఖ నుంచి అనంతపురం వరకు.. అనేక ప్రాజెక్టులు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో ప్రైవేటు, గవర్నమెంటుకు సంబంధించి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినవి ఉన్నాయి. కొన్ని అంతకు ముందే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతోందంటే.. ఆయా ప్రాజెక్టులపై సహజంగానే అధికార పార్టీ నాయకుల ఆధిపత్యం ఉంటుంది. ఏదో ఒక రూపంలో కొంత సొమ్ము ఆశించడం సహజం.
అనుమతులు.. ఇతరత్రా సంగతుల పేరుతో.. ఆయా ప్రాజెక్టులపై ఆధిపత్యం కోసం నాయకులు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎవరికి దక్కాల్సిన రూపాయి వారికి దక్కాల్సిందే..! దీనిలో తర తమ బేధాలు లేవు. గతంలో వైసీపీ నేతలు తీసుకున్నారని.. ఆరోపించిన టీడీపీ నాయకులు ఇప్పుడు అదే బాటలో తమ లాభాలు తాము అందుకుంటున్నారు. పైగా.. ఎవరికీ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తారు. ఎవరూ ఏమీ గుర్తు పట్టనట్టే భావిస్తారు. కానీ, ఎక్కడో ఒకచోట మాత్రం వారు దొరికిపోతూనే ఉన్నారు.
అనంతపురంలో కియా పరిశ్రమను గతంలో వైసీపీ ఎంపీ ఒకరు బెదిరించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్. కాకపోతే.. పార్టీ జెండా మారిందంతే. విశాఖలో ఓ కీలక హోటల్ ముందు.. గతంలో వైసీపీ నాయకుడి ఫొటోలు-ఆశీస్సులు ఉండేవి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. కాకపోతే.. రంగు మారింది అంతే..!! కాకినాడ నుంచి తిరుపతి వరకు కూడా.. అనేక ప్రాజెక్టుల పరిస్థితి ఇలానే ఉంది. కానీ.. ఈవిషయంలో ఎవరూ రచ్చ చేసుకోరు. ఎవరూ రోడ్డున పడరు. అంతా.. సర్వసమానత్వం పాటిస్తారు. దటీజ్ పాలిటిక్స్..!!