ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు...స్కెచ్ గీస్తోంది ఎవరు ?
ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వచ్చి పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఏపీలో మూకుమ్మడి ఉప ఎన్నికలు వచ్చి పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియా మీటింగులో చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తే ఈ దిశగానే అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీని బహిష్కరించలేదని, తాము ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళామని కోర్టుకు స్పీకర్ ఆఫీస్ జవాబు చెప్పాల్సి ఉందని అన్నారు. అంటే బంతి తమ వద్ద లేదని ఆయన క్లారిటీగా చెప్పారు.
పైగా ఒక సాధారణ ఎమ్మెల్యేగా తనకు టైం ఇస్తే ఏపీ సమస్యలను ఎలా ప్రస్తావిస్తాను అని ప్రశ్నించారు. తమ పార్టీని విపక్షంగా గుర్తించాలని మరోసారి డిమాండ్ చేశారు. అయితే అది జరగని పని అని అర్ధమవుతున్న విషయం.
ఇటీవలనే ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు అసెంబ్లీ నిబంధలను మీడియా ముఖంగా వినిపించారు. ఒక సభ్యుడు అరవై రోజుల కంటే ఎక్కువ రోజులు సభకు దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా అతని సభ్యత్వం రద్దు అవుతుందని రఘురామ చెప్పారు. పులివెందులకు ఉప ఎన్నికలు రావచ్చు అని కూడా చెప్పారు.
అందువల్ల అసెంబ్లీకి వచ్చి జగన్ సహా వైసీపీ సభ్యులు తమ మనోగతం వినిపించాలని ఆయన కోరారు. అంటే అసెంబ్లీకి రాకపోతే ఎవరి ప్రమేయం లేకుండా నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారని ఉప సభాపతి చెప్పినట్లు అయింది. ఒక విధంగా ఇది వైసీపీలో కలవరం రేపాల్సిన విషయమే.
కానీ దానిని జగన్ మీడియా ముఖంగా తిప్పికొట్టారు. మేము క్లారిటీగానే ఉన్నామని ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు. దీంతో పీట ముడి బిగుసుకున్నట్లు అయింది. ఈ నెల 24 నుంచి మొదలు కాబోతున్న బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారని ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. అయితే అదంతా ఉత్త పుకారు మాత్రమే అని జగన్ మాటలతో తేటతెల్లమైంది.
దాంతో అటు టీడీపీ కూటమి నేతలు కొందరు పులివెందులకు ఉప ఎన్నికలు అని అంటున్నారు. ఇటు చూస్తే సభకు హాజరయ్యేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ పట్టుబడుతోంది. ఇపుడు బంతి తిరిగి కూటమి వైపు వెళ్ళింది. మరి కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఏపీలో కేవలం 11 సీట్లు తప్ప అన్నీ కూటమి చేతిలో ఉన్నాయి. దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా బలంగా కూటమి ఉంది. మరి పక్కాగా వ్యూహరచన చేస్తే కనుక ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు మొత్తం ఒక్క దెబ్బకు రద్దు అవుతాయి. ఆరు నెలలు తిరగకుండా ఉప ఎన్నికలు వచ్చి పడతాయి.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 58 శాతం ఓటు షేరుని దక్కించింది 95 స్ట్రైకింగ్ రేటుతో సీట్లు కొల్లగొట్టిన కూటమికి ఉప ఎన్నికలు నల్లేరు మీద నడకగా ఉంటాయని నమ్మకం కుదిరితే తప్పకుండా ఎన్నికల నగరా మోగి తీరుతుంది అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఏపీలో కూటమికి కొండంత అండగా ఉంది.
దాంతో వైసీపీని ఏపీలో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలని అనుకుంటే ఇదే సరైన అదను అని భావిస్తే మాత్రం ఉప ఎన్నికలకు సమరం సిద్ధమైనట్లే అంటున్నారు. అయితే ఉప ఎన్నికలు వస్తే తమకే లాభమని వైసీపీ ఆలోచిస్తోందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికల మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు తొందరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
మరి దాని కంటే ముందు ఉప ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చు అన్న ఆలోచన ఏమైనా ఉందా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే ఉప ఎన్నికలు అంటూ వస్తే ఎవరికీ అంతా ఈజీ కాదనే అంటున్నారు. అందుకే రెండు వైపుల నుంచి కూడా గంభీరమైన మాటలే వినవస్తునాయని చెబుతున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో.