తెలంగాణను మించి: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం!
ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, పెట్టుబడులకు గమ్య స్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి వ్యవసాయ రంగం కీలకమని భావించినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. 48 వేల కోట్ల రూపా యలతో వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించినట్టు వివరించారు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత ఆంధ్ర ప్రదేశ్ అనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అదేసమయంలో విజన్ 2047 సాకా రానికి కూడా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గతంలో వైసీపీ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందన్న ఆయ న.. రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు కూడా రాకుండా చేసిందన్నారు.
అందుకే.. రైతుల కోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం.. రూ.300 కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాలూ అభివృద్ధి చెందాలన్న ద్రుఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. మేలైన వ్యవసాయం.. మేలైన రాబడి నినాదంతో రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. విత్తనాలు, పురుగు మందుల నుంచి రైతులకు ఇచ్చే సబ్సిడీల వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు.
ఈ క్రమంలోనే వచ్చే 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారు. ఇప్పుడు దీనిని మించి.. ఏపీ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోవడం గమనార్హం. అయితే.. పెట్టుబడుల సాధన, సంపద సృష్టి తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేయనున్నట్టు సర్కారు చెబుతోంది.