కూటమి మంత్రులు నుంచి సౌండ్ మిస్ !
జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధిత శాఖ మంత్రి అనిత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే వైసీపీ నుంచి నాయకులు వరసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఇష్యూని వేడెక్కిస్తూ పోతున్నారు.;

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాబు తప్పించి 24 మంది మంత్రులు ఉంటారు. ఇందులో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ని కాకుండా చూస్తే 22 మంది ఉన్నారు. మరి ఈ మంత్రులలో అతి కొద్ది మంది తప్ప మిగిలిన వారు అంతా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు అని అంటున్నారు.
మంత్రులు అన్న తరువాత బాధ్యతలు ఉంటాయి. అదే సమయంలో ప్రభుత్వాన్ని వెనకేసుకుని రావడమూ ఉంటుంది ఏపీలో చూస్తే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఆయన పోలీసుల మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో చేశారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం తీరుని తప్పు పడుతున్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అని సెటైర్లు వేస్తున్నారు. వచ్చేది మేమే అని గట్టిగా సౌండ్ చేస్తున్నారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇటు నుంచి కూటమి ప్రభుత్వం తరఫున కాచుకోవాల్సిన మెజారిటీ మంత్రులు మాత్రం మనకెందుకులే అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.
గతంలో అయితే 2014 నుంచి 2019 మధ్య జగన్ విమర్శలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి కనీసంగా అరడజను మంది దాకా మంత్రులు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూ కూడా ఒక్కో దశలో ఉండేది. ఇక వైసీపీ అయిదేళ్ళ పాలనలో నిత్యం ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముప్పయి మంది దాకా టీడీపీ సీనియర్లు ఉండేవారు.
అంత పెద్ద బృందం అండగా ఉండడంతో 151 సీట్లతో అధికారంలో ఉన్నా కూడా వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. కౌంటర్లు ఇచ్చుకోలేక సతమతమయ్యేది. కానీ ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితి ఎక్కడా లేనే లేదని అంటున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది అన్న చర్చ కూడా సాగుతోంది.
జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధిత శాఖ మంత్రి అనిత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే వైసీపీ నుంచి నాయకులు వరసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఇష్యూని వేడెక్కిస్తూ పోతున్నారు. కానీ కౌంటర్ చేసే పరిస్థితి కూటమి నేతలలో అయితే కనిపించడం లేదని అంటున్నారు. దీనికి కారణం ఎక్కువ మంది జూనియర్ మంత్రులు ఉండడం అని అంటున్నారు.
మరి కొందరు ఎటు మాట్లాడితే ఏమి వస్తుందో అని ఆలోచిస్తున్నరు అని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో చెప్పి జనంలోకి పాజిటివిటీని పెంచవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది. కొందరు మంత్రులు తమకు సంబంధించిన శాఖల విషయంలోనూ కౌంటర్ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
దాదాపుగా ఏడాదికి దగ్గరగా కూటమి ప్రభుత్వం వచ్చేసింది. ఇక జగన్ వ్యూహాత్మకంగా ప్రభుత్వం మీద దాడిని పెంచుతున్నారు ముందు ముందు అది మరింతగా ఎక్కువ కావచ్చు కూడా అని అంటున్నారు. మరి ఇప్పటి నుంచే సరైన కౌంటర్లు ఇవ్వకపోతే ప్రతిపక్షం మాటే జనంలోకి వెళ్తుంది కదా అని అంటున్నారు.
నిజానికి జగన్ నోరు జారారు. కూటమి ప్రభుత్వానికి చాన్స్ ఇచ్చారు. కానీ దానిని సరిగ్గా అందిపుచ్చుకోవడం లో తడబాటు పడుతున్నారని అంటున్నారు. ఆఖరుకు సీపీఐ నారాయణ వంటి వారు కూడా జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఖండించినా కూటమిలోని మెజారిటీ మంత్రులు అందులో సీనియర్లు కూడా పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడాలి అన్నదే చర్చగా ఉంది.
అయితే ఇది ఆరంభం మాత్రమే అని వైసీపీ అంటోంది. ముందు ముందు జగన్ కూటమిని ఇంకా గట్టిగా టార్గెట్ చేస్తారు. అపుడు కూడా ఇలాగే సైలెంట్ గా ఉంటే కనుక కూటమికి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.