కేసుల మీద కేసులు.. వంశీని వెంటాడుతున్న కష్టాలు..

మంత్రి లోకేశ్ రెడ్ బుక్ లో పేరున్న వంశీకి ఇప్పట్లో కష్టాలు వీడవని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-16 16:42 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం న్యాయవాదులు, వైసీపీ పార్టీ అధిష్టానం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, వంశీపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయనకు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గత ప్రభుత్వంలో దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఈ ప్రభుత్వంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేశ్ కు ఎదురైన అనుభవం తాజాగా వంశీ అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ప్రభుత్వంలో చింతమనేనిపై 12 కేసులు నమోదు చేసి 64 రోజులు జైలులో ఉంచారు. అదేవిధంగా మాజీ ఎంపీ నందిగామ సురేశ్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అవగా, ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఎస్సీ మహిళ హత్య కేసులో బయటకు రాకుండా జైలులోనే ఉంచారు. దాదాపు 150 రోజులు జైలు జీవితం గడిపిన సురేశ్.. ఆ తర్వాతే బెయిల్ పై వచ్చారు. ఇక వల్లభనేని వంశీ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనపై గతంలో 16 కేసులు పెండింగులో ఉండగా, తాజాగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

మంత్రి లోకేశ్ రెడ్ బుక్ లో పేరున్న వంశీకి ఇప్పట్లో కష్టాలు వీడవని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వంశీ అనుసరించిన వైఖరికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారని అంటున్నారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీకి ముందస్తు బెయిల్ లభించింది. ఇక అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తున్న సత్యవర్థన్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారనే కారణంగా మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి ఫిర్యాదు ఉపశంహరించుకునేలా ఒత్తిడి చేశారని వంశీపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులోనే ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనకు బెయిల్ తెప్పించేందుకు వైసీపీ అగ్ర నాయకత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ కేసులో వంశీకి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకాకుండా అడ్డుకునేందుకు మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తోపాటు టీడీపీ నేతలపై వంశీ గతంలో నోరు పారేసుకున్నారని తాజాగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో అబ్యూజుడ్ లాంగ్వేజ్ వాడిన వారిని జైలుకు పంపుతోంది. సోషల్ మీడియాను మంచి కోసమే వాడుదామంటూ ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం.. వివిధ సామాజిక మాధ్యమాల్లో నేతలను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్, శ్రీ రెడ్డి వంటివారిపైనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వంశీపైనా అవే తరహా కేసులు నమోదు చేస్తున్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా సోషల్ మీడియా కేసులో ఆయనను విడిచి పెట్టకూడదనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే వంశీపై తొలి నుంచి వివిధ కేసులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వ హిట్ లిస్టులో ఉన్న ఆయన అరెస్టు అయిన తర్వాత ఆ కేసుల బూజు దులుపుతున్నారు పోలీసులు. అదేవిధంగా భూ ఆక్రమణలు, బెదిరింపులు, దాడి వంటి కేసులు ఆయనపై తాజాగా నమోదవుతున్నాయి. గన్నవరంతోపాటు విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో వంశీపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయంటున్నారు. మరోవైపు వంశీని బెయిల్ పై బయటకు తెచ్చేందుకు వైసీపీతోపాటు ఆయన సతీమణి పంకజశ్రీ ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News