దేశంలోకి భారీగా బంగ్లా అమ్మాయిలు.. ఏపీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు !

ఏపీ పోలీసులు షాకింగ్ అంశాల్ని.. విస్మయానికి గురి చేసే వాస్తవాలతో పాటు.. ఆందోళనకు గురి చేసే వివరాల్ని తమ విచారణలో భాగంగా గుర్తించారు.

Update: 2025-02-26 05:00 GMT

ఏపీ పోలీసులు షాకింగ్ అంశాల్ని.. విస్మయానికి గురి చేసే వాస్తవాలతో పాటు.. ఆందోళనకు గురి చేసే వివరాల్ని తమ విచారణలో భాగంగా గుర్తించారు. సంచలనంగా మారిన ఈ వివరాల్ని దేశ హోం శాఖ సైతం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ కు చెందిన అమ్మాయిల్ని కోల్ కతా కేంద్రంగా చేసుకొని ఒక భారీ వ్యభిచార రాకెట్ నడుస్తున్న విషయాన్ని ఏపీ పోలీసులు తాజాగా గుర్తించారు.

ఇటీవల జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళల్ని విచారించిన వేళ.. వారి వివరాల్ని సేకరించగా అందులో బంగ్లాదేశ్ కు చెందిన వారే ఉండటం.. వారంతా అక్రమంగా దేశ సరిహద్దుల్ని దాటేసి కోల్ కతాకు వచ్చేయటం.. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతూ వ్యభిచారం చేస్తున్న వైనాన్ని గుర్తించారు. గడిచిన రెండేళ్లలో విజయవాడ పోలీసులు బంగ్లాదేశ్.. మయన్మార్ కు చెందిన 40 మంది యువతుల్ని.. పది మంది మైనర్లను వ్యభిచార కూపం నుంచి బయపడేశారు. ప్రస్తుతం సుమారు 50 మందికి పైగా బంగ్లాదేశీయులు.. మయన్మార్ కు చెందిన వారు నగరానికి చేరుకున్నట్లుగా గుర్తించారు.

వీరిని వారి దేశాలకు తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మానవ అక్రమ రవాణా ఏ రీతిలో జరుగుతుందన్న అంశంపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పశ్చిమబెంగాల్ కు చేరుకున్న కొందరు.. కొంతకాలానికి తమను తాము లోకల్ గా చెలామణీ చేసుకుంటారు. వీరిలో కొందరు పురుషులు.. మహిళలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

బంగ్లాదేశ్ లోని పేద కుటుంబాలకు ఉపాధి.. ఉద్యోగ సౌకర్యాల్ని అందిస్తామని చెబుతూ వారిని ఆకర్షిస్తుంటారు. మైనర్లకు రూ.20 వేలు అడ్వాన్సు.. యువతులకు రూ.35 వేలు అడ్వాన్సుగా వారి కుటుంబ సభ్యులకు ఇస్తారని.. మొదట వారిని కోల్ కతాకు చేర్చి.. ఆ తర్వాత వారికి విలాసవంతమైన జీవితాన్ని అస్వాదించొచ్చు అంటూ.. వ్యభిచార ఉచ్చులోకి దించుతున్నట్లుగా గుర్తించారు.

భారత్ కు చేరుకున్న తర్వాత బ్యూటీపార్లర్లు.. మసాజ్ సెంటర్లు. వ్యభిచారాల్లోకి.. హోటళ్లలోకి పని చేసేందుకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాలు.. చెరువులు.. ఖాళీ ప్రదేశాలు.. సొరంగ మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్ కు చేరుస్తారు. అక్కడి నుంచి కోల్ కతాకు చేరిన అమ్మాయిలకు నకిలీ ఆధార్.. ఓటరు గుర్తింపు కార్డుల్ని తయారు చేయిస్తారు. అనంతరం వారిని దళారులకు అప్పగిస్తారు.

బంగ్లా.. మయన్మార్ యువతులకు ఢిల్లీ..హైదరాబాద్.. బెంగళూరు.. ముంబయి.. చెన్నై. విశాఖపట్నం తదితర నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. కోల్ కతాకు చెందిన దళారులు ఐదారుగురు యువతులు.. మైనరలను ఆయా నగరాలకు తీసుకెళ్లి.. అక్కడి డేటింగ్ యాప్ లు.. స్పా సెంటర్లు.. వ్యభిచార గ్రహాల నిర్వాహకులకు ఆయా మహిళల అందం..ఆకర్షణకు తగ్గట్లు రూ.1-రూ.2 లక్షల వరకు అడ్వాన్సుగా చెల్లించి తమ చీకటి కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారని గుర్తించారు.

ఖరీదైన దుస్తులు.. రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ.. వారికి విలాసవంతమైన జీవితాల్ని పరిచయం చేయటం.. తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వారిని మార్చటం ద్వారా పోలీసులకు దొరక్కుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. సదరు అమ్మాయిల మీద వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతంగా రూ.20 నుంచిరూ.30 వేల వరకు ఇవ్వటంతో పాటు కమిషన్ కూడా ఇవ్వటం ద్వారా వారు మాట్లాడకుండా ఈ చీకటి కూపంలో ఉండిపోతున్నట్లుగా చెబుతున్నారు. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. ఉపాధి అవకాశాలు లేకపోవటం.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అసరాగా ఉండేందుకు తామిలా చేస్తున్నట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. పశ్చిమబెంగాల్ సరిహద్దులపై కేంద్రం మరింత ఫోకస్ చేయటంతో పాటు మానవ అక్రమరవాణాతో పాటు.. ఇంకేమైనా కార్యకలాపాలు సాగుతున్నాయా? అన్న అంశం మీదా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News