నాన్ టీడీపీ కమ్మ...సానుభూతి కరువేనా ?

ఏపీలో రాజకీయం కులాలుగా విడిపోయి దశాబ్దాలు దాటుతోంది. ఇటీవల అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇదే విషయం చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2025-02-27 17:30 GMT

ఏపీలో రాజకీయం కులాలుగా విడిపోయి దశాబ్దాలు దాటుతోంది. ఇటీవల అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇదే విషయం చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే రాజకీయాల్లో కులమే బలం. అదే అసలైన ఆలంబన. ఈ క్రమంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అంటే ట్రెడిషనల్ గా కమ్మల పార్టీగా చెబుతారు. అందరూ కాకపోయినా అత్యధిక శాతం కమ్మలు టీడీపీ వెంటే దశాబ్దాలుగా ఉంటూ వస్తున్నారు.

అయితే టీడీపీ ఆవిర్భావం నాటికి కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ లో కూడా కమ్మలు రాజకీయంగా కీలక స్థానాలలో ఉంటూ వచ్చారు. అలా చాలా మంది మంత్రులుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా కీలక పదవులను అందుకున్నారు. అలా కాంగ్రెస్ ని అభిమానించే కమ్మలు అయినా టీడీపీ ని ఆరాధించే కమ్మలు అయినా పెద్దగా విరోధ భావంతో మెలిగింది లేదు. రాజకీయాన్ని అలాగే తీసుకున్నారు. కమ్మ సామాజిక వర్గం కూడా తమ వారు ఎక్కడ ఉన్నా పదవులు అందుకుని వెలిగితే చాలు అనుకుంది. వీలైనంత మేరకు అందరికీ మద్దతు ఇస్తూ వచ్చింది.

కానీ విభజన ఏపీలో చూస్తే కనుక ఆ పరిస్థితి అయితే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీలో కమ్మలు కొందరు ఉన్నారు. వారికి ఆ పార్టీ కీలక అవకాశాలు ఇచ్చింది. అదే సమయంలో వారు టీడీపీ అధినాయకత్వాన్నే సవాల్ చేసేలా విమర్శలు చేశారు అన్న ప్రచారమూ ఉంది. దాంతో ఏపీలో కమ్మలు అంతా ఎన్నడూ లేని విధంగా టీడీపీ చుట్టూ పోలరైజ్ అయ్యేలా ఈ పరిణామం దోహదపడింది అని చెబుతారు.

బీజేపీలో కమ్మలు ఉన్నా జనసేనలో ఉన్నా ఓకే కానీ వైసీపీకి మద్దతు ఇస్తే మాత్రం వారిని వెలి వేసేంతగా ఆ సామాజిక వర్గంలో పరిస్థితి ఉందని ప్రచారం అయితే సాగింది. ఇపుడు దానికి మరింత ఊతమిచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణం రాజకీయం కాస్తా సామాజిక వర్గ పోరుగా ఒక దశలో మారి పీక్స్ కి చేరుకోవడమే అని అంటున్నారు.

ఈ క్రమంలో టీడీపీలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి లాంటి వారు ఇపుడు టార్గెట్ అవుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఆనాడు వారు అతిగా ప్రవర్తించడమూ నిజమే కావచ్చు. దాంతోనే వారి మీద కేసులు పడి మరీ ఈ రోజున అరెస్టుల దాకా కధ సాగుతోంది. అయితే వారికి రాజకీయంగా వైసీపీ మద్దతు ఎంత ఉన్నది అన్నది కనుక చూస్తే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసారు. ఇపుడు పోసాని క్రిష్ణ మురళి వంతు అయింది. ఇక కొడాలి నాని ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. చిత్రంగా వీరికి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతూంటే టీడీపీని అమితంగా ఆరాధించే కమ్మ సామాజిక వర్గం మాత్రం వారిని పూర్తిగా దూరం పెడుతోంది అని అంటున్నారు.

అయితే ఈ తరహా రాజకీయాలు మంచివి కావు. సామాజిక చీలికలూ మంచివి కావు అనే అంటున్నారు. అంతే కాదు ఏపీ లాంటి చోట కులాల కన్న అభివృద్ధినే అంతా ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు సాగాలని అంటున్నారు. ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందినా వారికి తాము అభిమానించే పార్టీలో చేరే స్వేచ్చ ఉంది. అయితే వారు రాజకీయ పరిభాషను జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.

లేకపోతే అది కాస్తా విపరిణామాలకు దారి తీస్తుందని చివరికి ఇలాగే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద ఏపీలో నిట్ట నిలువునా చీలిన ఈ రాజకీయ సామాజిక పరిణామాలు రానున్న కాలంలో అయినా మారాలని అంతా ఆశించడమే మేలు.

Tags:    

Similar News