అసంతృప్తిలో సంతృప్తి : మంత్రి పదవి సాటి వచ్చేనా...?
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో చంద్రబాబు కూడా ఈసారి కొత్త ప్రయోగమే చేశారు.
మంత్రి పదవి అంటే ఆ దర్జా వేరు, హోదా వేరు, ఆ రాజసం దర్పం వేరు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినపుడు చాలా మంది సీనియర్లు జూనియర్లు అంతా కలిపి డెబ్బై నుంచి ఎనభై మంది దాకా మంత్రి పదవుల కోసం ఆశిస్తూ వచ్చారు. వారంతా తన సీనియారిటీని సిన్సియారిటీని చూసుకుని తామే కాబోయే మంత్రులమని కూడా అనుకున్నారు.
అయితే చిత్రంగా కూటమి మంత్రివర్గంలో కొత్త ముఖాలకే చోటు దక్కింది. సాధారణంగా మంత్రివర్గం కూర్పు జరిగేటపుడు ఎక్కువ సార్లు గెలిచిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఎందుకంటే అనుభవంతో కూడిన పాలనను అందించవచ్చు అని బిల్లులు ప్రవేశపెట్టడం సభలో వ్యవహరించే తీరు, జనంలో కూడా ప్రభుత్వాన్ని తీసుకుని పోయే విధానం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు పెద్ద ఎత్తున వివరించే నేపధ్యం ఇవన్నీ కూడా సీనియర్లకు ప్లస్ పాయింట్లు అవుతాయి.
అయితే రాను రానూ అలాంటివి పట్టించుకోవడం లేదు, మంత్రులు కాకుండానే ముఖ్యమంత్రులు అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఎకాఎకీన ఎగబాకి కీలక స్థానాలను అందుకుంటున్న వారిని కూడా అంతా చూస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో చంద్రబాబు కూడా ఈసారి కొత్త ప్రయోగమే చేశారు. కొద్ది మందిని తప్పించి అత్యధికం కొత్త వారినే కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో సీనియర్లకు ఆశాభంగం కలిగింది.
ఆ జాబితా చూస్తే ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నిండా ఉంది. మంత్రివర్గం ఏర్పడి అయిదు నెలలు గడచింది నామినేటెడ్ పదవులు 80 కార్పోరేషన్లు దాకా రెండు విడతలుగా పందేరం జరిగింది. ఇక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారమే పదవులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రయారిటీ దక్కింది. అలాగే దశాబ్దాలుగా పార్టీకి అంకితం అయి పనిచేసిన వారికీ చోటు దక్కింది.
ఇపుడు ప్రభుత్వ విప్ పదవులను భర్తీ చేశారు. దానిలో కూడా మంత్రి పదవులను ఆశించి భంగపడిన వారికి చోటు ఇచ్చారు. అలా చూస్తే కనుక విశాఖ పశ్చిమం నుంచి నాలుగు సార్లు గెలిచిన గణబాబుకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఈ పదవిని గత వైసీపీ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి దక్కని కరణం ధర్మశ్రీకి ఇచ్చారు.
దాంతో గణబాబుకు ఈ పదవితో సంతృప్తి దక్కినట్లేనా అంటే ఏదో కొంతలో కొంత బెటర్ అన్న మాటైతే వినిపిస్తోంది. ఆయంతో పాటుగా మంత్రి పదవిని ఆశించిన మరి కొందరికీ విప్ పదవులు దక్కాయి. ఇక చూస్తే కేబినెట్ లో మంత్రి పదవి దక్కడం ఖాయమని బెట్టింగుల దాకా కధ నడచిన ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామ క్రిష్ణం రాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ఆయన కోరుకున్నది స్పీకర్ పదవి. అయితే ఆయనకు దక్కినది డిప్యూటీ స్పీకర్. ఇది ఆయనకు ఓకేనా అంటే ఉన్నంతలో సర్దుకుని పోవడమే అని అంటున్నారు. ఆయన సొంత సామాజిక వర్గం క్షత్రియులలో అయితే ఇదొక కంటి తుడుపు చర్యగానే చూస్తున్నారు.
ఈసారి మంత్రివర్గంలో క్షత్రియులకు ప్రాధాన్యత లేకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే ఉంది. అన్ని విధాలుగా అర్హుడైన రఘురామకు ఆ పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నారు. కేబినెట్ లో ఒక బెర్త్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి అది క్షత్రియుల కోసమే అని ఆశలు పెట్టుకున్నారు. కానీ జరిగినది వేరుగా ఉందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ నేతలు చాలా మంది ఉన్నారు. వారు మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. వారిలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఇక శ్రీకాకుళం నుంచి ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనకు మంత్రి పదవి ఖాయమని గాఢంగా నమ్మారు. కానీ ఆయనకు అది రాకపోగా ఏ పదవీ దక్కలేదు అన్న అసంతృప్తి అయితే అనుచరులలో ఉంది.
టీటీడీ మెంబర్ అయినా ఇస్తారని అనుకున్నారుట. అది దక్కలేదు, గతసారి ఇచ్చినట్లుగా ప్రభుత్వ విప్ అయినా ఇస్తారు అనుకుంటే అది కూడా లేకుండా పోయింది. ఇలా చాలా మంది ఇంకా నిరాశలోనే ఉన్నారని అంటున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించిన పల్లా శ్రీనివాసరావుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇలాగే ఏదో ఒకటి కొందరికి సర్దుతున్నారు, మరి కొందరికి అది కూడా లేదు అని అంటున్నారు. అయినా సరే అధికారంలో ఉన్నామన్న తృప్తిలో ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టడమే ఇక చేయాల్సింది అని అంటున్నారు.