వాట్సాప్ గవర్నెన్స్.. ఇంటింటికీ బాబు విజన్!
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు 500 రకాల ప్రభుత్వ సేవలను కూటమి సర్కారు ఒక్క క్లిక్కుతో ప్రజలకు చేరువ చేసింది.;

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు 500 రకాల ప్రభుత్వ సేవలను కూటమి సర్కారు ఒక్క క్లిక్కుతో ప్రజలకు చేరువ చేసింది. తద్వారా అవినీతి, అక్రమాలు, లంచావతారుల ను కట్టడి చేయాలని నిర్ణయించింది. దీనిని ప్రారంభించి రెండు మాసాలు అయింది. అయితే.. ఇది అనుకున్నంతగా ప్రజలకు చేరువ కాలేకపోయిందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ప్రభుత్వం చేయించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.
ఈ నేపథ్యంలో వాట్సాప్ పాలనపై అవగాహన కల్పించడానికి ఏప్రిల్ నెలలో 'ప్రతి ఇంటికి మనమిత్ర' కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్ ఫోన్లలో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే అందిస్తామని తెలిపారు. వీటిపై ప్రజలకు మరింత అవగాహన తీసుకురావాల్సి ఉందని.. అందుకే ప్రతి ఇంటికీ మన మిత్ర కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని తెలిపారు.
ఎందుకు?
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ.. ప్రస్తుతం లేదు. వివిధ కారణాలతో ఈ వ్యవస్థను కూటమి సర్కారు పక్కన పెట్టింది. కానీ, ఈ వ్యవస్థ లేకపోవడంతో పలు సమస్యలపై ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా ప్రతి పనికీ రేటు కట్టే సంస్కృతి పెరిగిపోయింది. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. మెజారిటీ గ్రామీణులు, పట్టణాల ప్రజలకు కూడా ఇది ఇంకా చేరువ కాలేదు. దీంతో ప్రస్తుతం మరో కార్యక్రమం ద్వారా చంద్రబాబు విజన్‌ను ప్రజలకు చేరువ చేయనున్నారు.