అన్నా క్యాంటీన్లు... మనోభావాలు దెబ్బ తింటున్నాయా ?

ఏపీలో అన్నా క్యాంటీన్లు దేశ స్వాతంత్ర దినోత్సవం వేళ ఘనంగా ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి సర్వం సిద్ధం అయిపోయింది

Update: 2024-08-14 17:53 GMT

ఏపీలో అన్నా క్యాంటీన్లు దేశ స్వాతంత్ర దినోత్సవం వేళ ఘనంగా ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి సర్వం సిద్ధం అయిపోయింది. అయితే అన్న క్యాంటీన్ భవనాల మీద దివంగత నేత ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దాంతో జనసైనికులు గుస్సా అవుతున్నారు.

ముఖ్యంగా పిఠాపురం జనసైనికులు అయితే ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి మరీ రచ్చ చేస్తున్నారు. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల భవనాల మీద చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాల్సిందే అని వారు కోరుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయి పైగా పిఠాపురం ఎమ్మెల్యే అని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా కాకపోయినా పిఠాపురం వరకూ అయినా పవన్ బొమ్మ పెడితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది డిమాండ్ కాదు రిక్వెస్ట్ అని చెబుతూనే పవన్ బొమ్మ ఉండాల్సిందే అని కోరుతున్నారు

పవన్ కళ్యాణ్ ని రెండున్నర లక్షల మంది పిఠాపురం ఓటర్లు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం అయినా పవన్ ఫోటో ఉండాలని వారు అంటున్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ పరంగా కాకుండా జనసైనికులుగా తాము కోరుతున్నామని వారు అంటున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఫోటోలు పెట్టించుకోవడం, తన పేర్లు రాయించుకోవడం అసలు ఇష్టం ఉండదని వారు అంటున్నారు. కానీ అభిమానులుగా తాము మాత్రం ఎంతో మధన పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాబట్టే పవన్ ఫోటో ఉండాలని కోరుతున్నామని వారు చెబుతున్నారు.

నిజానికి ఈ భవనాల మీద డొక్కా సీతమ్మ ఫోటో ఆమె పేరు ఉండాలని వారు అన్నారు. దానిని మధ్యాహ్న భోజన పధకం కోసం పెట్టినా అన్నా క్యాంటీన్లకు కూడా ఎందుకు పెట్టకూడదని వారు ప్రశ్నించారు. ఎక్కడ అన్న దానం జరిగినా ఆ మహాతల్లిని తలచుకునేలా పేరు ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు.

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని దేశమంతా గొప్పగా చెప్పుకుంటూ పవన్ మీద అభిమానాన్ని చాటుకుంటున్న వేళ ఆయన సొంత నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ల భవనాల మీద ఫోటో ఉండకపోవడం శోచనీయం అని అన్నారు. దీని మీద తాము అన్నా క్యాంటీన్ నిర్వాహకులను అడిగామని అయితే స్టేట్ వైడ్ ఒకటే డిజైన్ ఇచ్చారని ఇది పాలసీ డెసిషన్ అని వారు చెబుతున్నారని అన్నారు. స్టేట్ వైడ్ ఒకేలా ఉంటే ఉండొచ్చు కానీ పిఠాపురంలో మాత్రం పవన్ ఫోటో పేరు ఉండకపోతే ఊరుకునేది లేదని వారు అంటున్నారు.

ఈ విషయంలో వివాదం చిలికి చిలికి ఎటు వైపు దారి తీస్తుందో చూడాలని అంటున్నారు. మొత్తానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయని జనసైనికులు అంటున్నారు. నిజంగా అలా జరుగుతోందా అసలు అన్నా క్యాంటీన్ల విషయంలో జనసేన పెద్దల ఆలోచనలు వారి వైఖరి ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇది కేవలం అభిమానంతో డిమాండ్ చేసినట్లు అయితే ఎవరూ పట్టించుకునే అవకాశాలు లేవు. కానీ పార్టీపరంగా జనసేన కోరితే మాత్రం పిఠాపురం వరకూ పవన్ ఫోటో పేరు పెట్టే వీలుందని అంటున్నారు. మొత్తానికి అన్నా క్యనటీన్ల ప్రారంభం జరుగుతున్న వేళ పిఠాపురంలో సైనిక్స్ ఈ విధంగా కోరడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News