బాపట్లలో భారీ మార్పులు.. వైసీపీ వ్యూహం సక్సెస్ అయితే!
కీలకమైన బాపట్ల పార్లమెంటు స్థానంలో భారీ మార్పు దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలి..? ఎవరికి ఎక్కడ చోటు కల్పించాలనే విషయంలో వైసీపీ అధినేత జగన్ భారీ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలకమైన బాపట్ల పార్లమెంటు స్థానంలో భారీ మార్పు దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ కుమార్ ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చినా .. జగన్ అండతో పార్లమెంటులోకి అడుగు పెట్టారు.
అయితే.. ఆయనకు ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని.. రెండేళ్లుగా జగన్‌కు చెబుతున్నారు. దీంతో .. జగన్ కూడా ఇక్కడ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో బాపట్ల నుంచి పోటీ చేయడానికి మాజీ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్‌కేఆర్. విజయ్ కుమార్ కు హామీ ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఐఏఎస్‌గా రిటైర్ అయినప్పటి తర్వాత.. జగన్ ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో పోటికి కూడా విజయ్‌కుమార్‌రెడీ అయ్యారని తెలిసింది. ఈ క్రమంలోనే 'ఐక్యత విజయపథం' పేరిట తడ నుంచి తుని వరకూ పాదయాత్రతో దళిత, గిరిజన, బిసీ, మైనార్టీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌కు కూడా ఈయన్ను ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచనే ఉండడంతో బాపట్ల సరైన నియోజకవర్గమని ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీనిలో మరో కారణం కూడా.. ఉందని చర్చ సాగుతోంది.
పార్లమెంటులో బలమైన గళం వినిపించేందుకు ఐఏఎస్ గా పనిచేసిన వ్యక్తి అయితే.. తమకు ఉపయుక్తంగా ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే విజయ్‌కుమార్‌ను బాపట్ల నుంచి పోటీకి దింపుతారనే చర్చ సాగుతుండడం గమనార్హం. ఇక, నందిగం సురేష్‌కు ప్రత్తిపాడు కానీ.. వేమూరు కానీ.. కేటాయించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి ఈ మార్పులు సక్సెస్ అయితే.. వైసీపీ వ్యూహానికి తిరుగు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.