బాలయ్య అల్లుడు బుక్ అవుతున్నారా...?
విశాఖ జిల్లాలో వారాహి యాత్ర కాదు కానీ సీన్ లోకి చాలా మంది నాయకులు వచ్చేస్తున్నారు
విశాఖ జిల్లాలో వారాహి యాత్ర కాదు కానీ సీన్ లోకి చాలా మంది నాయకులు వచ్చేస్తున్నారు. పవన్ రుషికొండలో అక్రమాలు అంటూ భారీ ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి వైసీపీ నుంచి ధీటుగా బదులు వచ్చింది. మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే కాస్తా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఎదురుగా గీతం విద్యా సంస్థలు కూడా కనిపిస్తాయి. అక్కడ ఏకంగా ప్రభుత్వ భూములు కబ్జా అయినవి కనిపిస్తాయని విమర్శించారు.
ఇదే విధంగా మంత్రి రోజా కూడా గీతం విద్యా సంస్థల పేరిట బాలయ్య అల్లుడు నలభై ఎకరాల ప్రభుత్వ భూములను తీసుకుంటే పవన్ కళ్ళకు కనిపించలేదా అని ఎదురు ప్రశ్నించారు. అలా కనుక చూసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ టార్గెట్ అయిపోయారు. ఆయనకు ఏమి సంబంధం లేకపోయినా ముగ్గులోకి లాగేశారు.
ఇక గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూములు తీసుకున్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఆరోపణలు మాత్రం వైసీపీ నేతలు చేస్తూ ఆ వైపుగా చూపు పడేలా చేశాయి. దీని మీద టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అయితే నలభై ఎకరాల భూమిని గీతం సంస్థ తీసుకుంది అని మంత్రి ఆర్కే రోజా చేయడం దారుణం అని రిప్లై ఇచ్చారు.
ఇంకో వైపు చూస్తే రాజకీయంగా రాణించాలని చూస్తున్న శ్రీ భరత్ కి ఈ ఆరోపణలు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయనే అంటున్నారు. గతంలో గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాయని గోడల దాకా కూల్చేసి రెవిన్యూ అధికారులు హడావుడి చేశారు. ఇదంతా కొంత కాలం సాగింది. అయితే ప్రతీ దానికీ పత్రాలు కాగితాలు ఆధారాలు తమకు ఉన్నాయని గీతం సంస్థ నిర్వాహకులు అంటున్నారు. అయినా సరే పవన్ రుషికొండ పేరు చెప్పడంతో పాటు వైసీపీ నేతల భూకబ్జాలు అని ఎత్తుకోగానే టీడీపీ నేతల కబ్జాలు కనిపించడంలేదా అని వైసీపీ అటాక్ చేస్తోంది.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి కూడా నాడు భూముల దందాలో ఉన్నారని మరో మాజీ మంత్రి ఆరోపించినపుడు పవన్ ఎక్కడ ఉన్నారని మంత్రి రోజా ప్రశ్నించారు. ఆ ఇద్దరు మాజీ మంత్రులు టీడీపీలో ఉప్పూ నిప్పులా ఉంటున్న సంగతి విధితమే మరో వైపు చూస్తే నాలుగేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాజీ మంత్రులు భూ కబ్జాలు చేస్తే వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసారన్న ప్రచారం కూడా అప్పట్లో వినిపించింది. మరి చంద్రబాబు వేసిన సిట్ నివేదికను బయట పెట్టలేదన్న వైసీపీ తాము అధికారంలోకి వచ్చాక సిట్ నివేదికను బయట పెడతామని చెప్పుకొచ్చింది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక సిట్ ని నియమించిది. కానీ ఆ నివేదిక కూడా బయటకు రాలేదు. ఇపుడు కేవలం ఆరోపణలు వారిని వీరు వీరిని వారు అనుకోవడంతోనే సరిపెడుతున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ మీద వేలెత్తి చూపుతూంటే బాలయ్య అల్లుడు లాంటి వారిని వైసీపీ కార్నర్ చేస్తోంది అని అంటున్నారు. ఇది ఎంతవరకూ వెళ్తుందో అన్న చర్చ కూడా ఉంది మరి.