వివాదాస్పద ఎంపీని ఎమ్మెల్యేగా దించుతున్న జగన్!
విశాఖపట్నం ఎంపీగా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందిన సంగతి తెలిసిందే
విశాఖపట్నం ఎంపీగా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆయన ప్రముఖ బిల్డర్ గా ఉన్నారు. విశాఖపట్నంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్మాణ రంగంలో ఉన్నారు. ఈ క్రమంలో పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడిని కొందరు రౌడీలు ఆయన ఇంట్లోనే గృహనిర్బంధం చేయడం కలకలం రేపింది.
కాగా వచ్చే ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత జగన్ పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విశాఖ తూర్పు ఇంచార్జిగా అక్కరమాని విజయనిర్మల ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబుపై ఓటమి పాలయ్యారు. మరోవైపు వెలగపూడి ఇక్కడ వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో విశాఖను రాజధానిగా ఇప్పటికే ప్రకటించిన వైఎస్ జగన్ ఆ నగరంపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా వైసీపీకి దక్కలేదు. నాలుగు సీట్లలోనూ టీడీపీయే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈసారి విశాఖ నగరంలో మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ తూర్పులో వరుస విజయాలతో దూకుడు మీదున్న వెలగపూడి రామకృష్ణబాబుపై ఆయన కమ్మ సామాజికవర్గానికే చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఆయన అయితే వెలగపూడికి గట్టిపోటీ ఇవ్వగలరని.. ఆర్థికంగానూ బలవంతుడు కావడంతో పోటాపోటీ ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ త్వరలో తూర్పు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 25వ తేదీన పార్టీ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు(జీవీ)తో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 23న సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం విశాఖ తూర్పు వైసీపీ ఇంచార్జిగా యాదవ సామాజికవర్గానికి చెందిన అక్కరమాని విజయనిర్మల ఉన్నారు. ఈమె గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై వెలగపూడిపై ఓడిపోయారు. ప్రస్తుతం విజయనిర్మల వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్ గా ఉన్నారు. విశాఖ తూర్పు కోసం విజయనిర్మలతోపాటు విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి కూడా పోటీ పడుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎంవీవీ సత్యనారాయణ వైపే మొగ్గుచూపుతున్నారని టాక్.