నవంబర్ 1 విడుదల... ఉమ్మడి మేనిఫెస్టో ముహూర్తం వెనుక రీజన్ ఇదే?
అలా త్వరలో అని ప్రకటించిన నెల రోజులు దాటిన తర్వాత తాజాగా ఆ రెండు పార్టీల సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసింది
ఏపీలో ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే గడువు ఉండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ చాపకిందనీరులా తమ పని తాము చేసుకుని పోతుంటే... టీడీపీ - జనసేన పొత్తు పొడించింది! స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టవ్వడం వల్లే ఈ పొత్తు ఇంత వేగంగా కార్యరూపం దాల్చిందనేవారూ లేకపోలేదు! ఈ సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టవ్వడం.. అలా అరెస్టై ఇప్పటికి 40 రోజులు దాటుతుండటం వల్లే... టీడీపీ-జనసేనలు వేగంగ మరింత దగ్గరయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబును జైల్లో పరామర్శించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు పార్టీలూ కలిసే వెళ్తాయని ప్రకటించారు. త్వరలో ఉమ్మడి కార్యచరణ ఉంటుందని తెలిపారు.
అలా త్వరలో అని ప్రకటించిన నెల రోజులు దాటిన తర్వాత తాజాగా ఆ రెండు పార్టీల సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై చర్చించడం, అనంతరం కీలక ప్రకటన చేయడం తెలిసిందే. దీంతో... నవంబర్ 1న ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోందనే అనుకోవాలి!
వాస్తవానికి రాజమండ్రిలో జరిగిన మహానాడులోనే టీడీపీ మినీ మేనిఫెస్టోని విడుదల చేసింది. అనంతరం... దసరాకి పూర్తి మేనిఫెస్టోని విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే... టీడీపీ నేతలు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా... పరిస్థితులు మారిపోయాయి. మరోపక్క ఇప్పటికే జనసేన మేనిఫెస్టో రెడీ అయ్యిందని చెబుతున్నారు. దీంతో... ఈ రెండింటినీ మిక్స్ చేసి ఒక సరికొత్త మేనిఫెస్టోని విడుదల చేయాలని ఇరు పార్టీలూ భావిస్తున్నాయంట.
ఈ క్రమంలో ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా విడుదల చేయడానికి ఇరు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే మ్యానిఫెస్టో విడుదల అనే సౌండింగ్ కూడా బాగుంటుందని ప్లాన్ చేశారని అంటున్నారు. అదొక కారణం అయితే... అప్పటికి బాబు బయటకు వస్తారని ఎక్కడో చిన్న ఆశ అని అంటున్నారు పరిశీలకులు. అందుకే నవంబర్ 1 ని ముహూర్తం ఫిక్స చేశారని అంటున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్ మోస్ట్ అసాధ్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. కారణం... స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు నవంబర్ 8కి వాయిదా పడగా... ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న విచారణ జరగనుంది! మరోపక్క ఫైబర్ నెట్ కేసు పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న తీసుకోనుందని తెలుస్తుంది! ఈ నేపథ్యంలో నవంబర్ 1 న బాబుకు ఉమ్మడి మేనిఫెస్టో చూసే అవకాశం కూడా దాదాపు ఉండక పోవచ్చని అంటున్నారు!
అయితే... ఈ నెల 28తో సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ముగియనున్నాయి. దీంతో... స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వచ్చే వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉందేమో అనే ఆశ పలువురు వ్యక్తం చేస్తున్నారంట. అందులో చంద్రబాబు కోరినట్లుగా స్కిల్ కేసును సుప్రీంకోర్టు క్వాష్ చేస్తే సరి.. లేకపోతే మధ్యంతర బెయిల్ అడిగి జైలు నుంచి విడుదలయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు!
అయితే ఇవన్నీ పూర్తిగా ఊహాగాణాలు గానే పరిశీలకులు పరిగణిస్తున్నారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే పాయింట్ తో బాబుకు మద్యంతర బెయిల్స్ ఛాన్స్ ఉండకపోవచ్చనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... నవంబర్ 1 న మాత్రం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల మాత్రం పక్కా అని అంటున్నారు!