అసెంబ్లీ లాస్ట్ డే...బాంబు లాంటి వార్త...?
ఇక అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో ఎక్స్ పోజ్ చేయడానికి అధికార పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 దాకా జరుగుతాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగులో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈసారి అసెంబ్లీ సెషన్ సెలవులు పోనూ అయిదు రోజుల పాటు జరుగుతాయన్న మాట.
ఈ సమావేశాలలో కీలక బిల్లులను సభలోకి ప్రవేశపెట్టి ఆమోదించుకుంటారు అని తెలుస్తోంది. అదే విధంగా గత నాలుగున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్షేమం గురించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియచేస్తారు అని అంటున్నారు.
ఇక అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో ఎక్స్ పోజ్ చేయడానికి అధికార పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 22న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం గురించి 26న ఫైబర్ నెట్ స్కాం గురించి, 27న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం గురించి సభలో వరసగా చర్చించడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు.
తద్వారా ఈసారి అసెంబ్లీలో చంద్రబాబు అవినీతి అయిదేళ్ళ విభజన ఏపీలో ఎలా చేశారు అన్న దాని మీదనే ఫోకస్ చేస్తారు అని అంటున్నారు. ఈ మెసేజ్ ని జనాలలో పోనీయడానికే వైసీపీ ఈ రకంగా అసెంబ్లీలో వరసగా టీడీపీ స్కాములు అంటూ కొన్ని అంశాలు తెచ్చి మరీ చర్చకు పెడుతోంది అంటున్నారు.
దీని వల్ల టీడీపీ అయిదేళ్ల పాలనలో ప్రజా ధనం ఎంతలా లూటీ అయిందో చెప్పడమే కాకుండా బాబు అరెస్ట్ సక్రమం అని జస్టిఫై చేసేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎన్నికలు తరుముకుని వస్తున్న వేళ తమ ప్రభుత్వం ప్రతీ పైసా సంక్షేమం కోసం ఎలా ఖర్చు చేసింది అన్నది కూడా తెలియచేస్తుంది అంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక విషయం మాత్రం విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే అసెంబ్లీ సమావేశాల చివరిలో అసెంబ్లీ రద్దు ముందస్తు ఎన్నికల మీద ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేస్తారు అని అంటున్నారు. నిజానికి మంత్రులతో మాట్లాడిన సీఎం అసెంబ్లీకి ఎన్నికలు కేంద్రంతో పాటే వస్తాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే కేంద్రం ముందస్తు ఆలోచనల నుంచి పక్కకు తప్పుకుంది అని అంటున్నారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలకు వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి అంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ ఇబ్బందులలో పడడం, ఆయన లేని సమయంలో పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో ఉండడం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పార్టీ సరైన దిశా నిర్దేశం లేకుండా నిస్తేజంగా ఉందని వైసీపీ లెక్కలు వేస్తోంది.
సరిగ్గా ఈ టైం లో కనుక ఎన్నికలు పెట్టుకుని వెళ్తే మరోసారి తిరుగులేని విధంగా అధికారం దక్కుతుంది అని వైసీపీ అంచనా కడుతోంది. ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ మీద హై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆ తీర్పు మరి కొద్ది రోజులలో వెలువడనుంది. క్వాష్ పిటిషన్ ని హై కోర్టు కొట్టేస్తే మాత్రం చంద్రబాబు మరిన్నాళ్ళు జైలులో ఉండే పరిస్థితి ఉంటుంది.అది అయిదారు నెలలు అయినా పట్టవచ్చు అంటున్నారు. ఈ లోగా ముందస్తు ఎన్నికలు ఏపీలో జరిపిస్తే వైసీపీని అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే బాబు అరెస్ట్ తరువాత సింపతీ పెద్దగా లేదని వైసీపీ లెక్క కడుతోంది. అయితే బాబు అరెస్ట్ తరువాత సింపతీ పెరిగింది అని సీ ఓటర్ సర్వే పేర్కొంటోంది. సరే సింపతీ ఉందని అనుకున్నా దాన్ని సొమ్ము చేసుకునే సీన్ అయితే లేదు అని కూడా అంటున్నారు. బాబు బెయిల్ మీద వస్తారు అని టీడీపీ నేతలు ఆశతో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ ఆయన బెయిల్ మీద రాలేకపోయినా మరిన్నాళ్ల పాటు జైలులో ఉండాల్సి వస్తే మాత్రం అసలైన నాయకత్వ సంక్షోభం టీడీపీలో తలెత్తడం ఖాయం అని అంటున్నారు. అందువల్ల వైసీపీ వేచి చూసే ధోరణితో ఉందని అంటున్నారు. మరి అసెంబ్లీ లో లాస్ట్ డే ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.