ఏపీ ఫలితాలు కేస్ స్టడీగా !
కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయి. వైసీపీ అనుకున్నది ఉల్టా సీదా అయింది.
మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తెలిసి అన్నారో లేక తెలియక అన్నారో ఏమో కానీ ఏపీలో వచ్చే ఫలితాలు దేశ స్థాయిలో చర్చనీయాంశం అవుతాయని చెప్పారు. దేశమంతా ఉలిక్కిపడి చూస్తుందని అంతా ఈ ఫలితాల గురించి చర్చించుకుంటారని ఆయన అన్నారు. ఇపుడు అదే జరుగుతోంది అంటున్నారు.
కానీ ఫలితాలు రివర్స్ అయ్యాయి. వైసీపీ అనుకున్నది ఉల్టా సీదా అయింది. 175 సీట్లు వస్తాయనుకుంటే అవి కాస్తా 11 గా మారాయి. ఇదేమిటి కేవలం అయిదేళ్ల క్రితం 151 సీట్లు ఇచ్చిన జనాలు ఇపుడు కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్యాబలం కూడా ఇవ్వరా అన్న చర్చ అయితే నడుస్తోంది.
గత నెలన్నరగా దేశంలో ఏపీ ఫలితాల మీద అనేక రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేశారు. ఇంతలా అమలు చేసినా ఓటమి పాలు కావడం అదీ దారుణంగా అంటే ఏమిటీ తీర్పు వెనక ఉందని అంతా చర్చించుకుంటున్నారు.
ఈ ఫలితాల విషయంలో మరోటి కూడా ఉంది. అదే టీడీపీ కూటమి ఘన విజయం. ఏకంగా 175కి 164 సీట్లు సాధించడం. దాదాపుగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలకు ఎంపీ స్థాయిలో మెజారిటీలు రావడం. ఎంపీలకు అయిదు లక్షలు నాలుగు లక్షలు మెజారిటీలు రావడం. దీంతో ఈ తీర్పు జాతీయ స్థాయిలో ఒక కేసు స్టాడీగా మారింది అని అంటున్నారు.
నిన్నటికి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయ్తే ముంబైలోని అంబానీ పెళ్ళికి వెళ్ళినా ఏపీ ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఏపీ ఫలితాలు ఒక కేసు స్టడీగా మారాయని అంటున్నారు.
అధికారంలో ఉన్న పార్టీకి ఇంతలా గుణపాఠం చెప్పడం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అంతకు పదింతలు ఆదరణ దక్కడం మీదనే అంతా చర్చిస్తున్నారు అని అంటున్నారు. ఈ అద్భుతమైన ఫలితాల వెనక ప్రజలు అధికారంతో పాటు హెచ్చరికను కూడా ఇచ్చారని పురంధేశ్వరి అన్నారు
వారే అసలైన ప్రభువులు అని గుర్తుంచుకోవాలని ఆమె పార్టీ వాదులను కోరారు. ఏది ఏమైనా ఏపీలో ఫలితాలు ఎవరికీ ఈ రోజుకీ అంతు చిక్కడం లేదు. ఒడిషాలో అయిదు సార్లు అధికారంలో ఉన్న బిజూ జనదాదళ్ పార్టీకి యాభైకి పైగా అసెంబ్లీ సీట్లు వచ్చాయి. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ఎంత వ్యతిరేకత వచ్చినా 39 అసెంబ్లీ సీట్లు వచ్చాయి.
అలాగే కర్ణాటకలో సైతం బీజేపీ అయిదేళ్ల పాలన మీద ఎంత వ్యతిరేకత ఉన్నా మంచి నంబర్ తోనే విపక్ష స్థానంలో ఉంది. మరి ఏపీలో ఏమైంది వైసీపీకి ఇంత పెద్ద శిక్ష వేశారు అని చర్చించుకుంటున్నారు ఓటమి అన్నది సహజమైనా మరీ ఇత నేలబారుడుగా ఫలితాలు అయితే ఎలా అన్నదే ఎవరికీ ఊహకు అందడం లేదు అని అంటున్నారు.
ఈ రోజునే కాదు బహుశా రానున్న అయిదు పదేళ్ళు ఆ తరువాత కూడా ఏపీ ఫలితాలు ఒక కేసు స్టడీగానే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు విచ్చలవిడిగా సంక్షేమ పధకాలు అందించి ఓడిన పార్టీగా వైసీపీ ఉంది. ప్రజల హామీలను తీర్చినా ఎందుకు తిరస్కరించారు అంటే దానికి సరైన జవాబు అయితే లేదు. ఎన్ని విశ్లేషణలు చేసినా ఇంకా చేయాల్సి ఉంటుంది.
వైసీపీ నేతల అహంకారం లేక కొన్ని వర్గాలలో అసంతృప్తి ఇలా ఎన్నో చెప్పుకున్నా సీట్లు ఇంత తక్కువ ఏమిటి అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది అని అంటున్నారు. అదే దేశంలో చర్చకు కారణం అవుతోంది.