ఒకనాటి రాయలసీమలా.. పలనాటి సీమ సీన్లు..

ఇక మిగలింది పలనాటి సీమ. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట మరికొన్ని మండలాలను కలిపి పల్నాడుగా వ్యవహరిస్తారు

Update: 2024-05-23 17:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను రాయల సీమగా వ్యవహరిస్తారు. ఒకప్పుడు నిజాం పరిపాలనలో ఉన్నవీటిని బ్రిటీష్ వారికి ఇచ్చారు. దీంతో దత్త మండలాలుగానూ పేర్కొంటారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డ ప్రాతం కూడా. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలను కలిపి నడిగడ్డ అంటారు. క్రిష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉండడంతోనూ దీనిని నడిగడ్డగా పేర్కొంటారు. ఇక మిగలింది పలనాటి సీమ. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట మరికొన్ని మండలాలను కలిపి పల్నాడుగా వ్యవహరిస్తారు. 2022లో ఏపీలో జిల్లాల విభనతో పల్నాడు ఓ జిల్లాగా ఏర్పడింది.

పౌరుషాలకు పెట్టింది పేరు

అటు రాయల సీమ కానీ, ఇటు నడిగడ్డ కానీ.. మధ్యలో ఉన్న పల్నాడు కానీ.. పౌరుషాలకు పెట్టింది. ఇక్కడి రాజకీయాలూ అంతే గరంగరంగా ఉంటాయి. మనుషులు సైతం నమ్మిన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉంటారు. దీంతో రాజకీయంగా విభేదాలు తీవ్ర స్థాయిలో కనిపిస్తుంటాయి. కాగా, కొన్నిసార్లు ఇవి గొడవలుగా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో.

దాడులు ప్రతిదాడులు

వర్గ రాజకీయాలు బలంగా ఉండే పల్నాడు, రాయలసీమ, నడిగడ్డలో సహజంగానే పంతాలు పట్టింపులు అధికం. ఇలాంటి సమయంలో ఏ మాత్రం వ్యవహారాలు తేడా వచ్చినా అవి ఘర్షణ రూపం దాల్చుతుంటాయి. ఎన్నికల వంటి సున్నిత సమయంలో మరింత ఉద్రికత్తలు చెలరేగుతుంటాయి. అందుకే పోలింగ్ సందర్భంగా ఇలాంటి వాటిని సున్నిత ప్రాంతాలుగా పరిగణిస్తుంటుంది.

అప్పట్లో సీమలో..

ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా ఓ రెండు, మూడు దశాబ్దాల కిందటి వరకు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. కాగా, మూడు దశాబ్దాల కిందటి వరకు రాయలసీమలో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చేవి. పోలింగ్ బూత్ లలోకి చొరబడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి కథనాలు వచ్చేవి. ఇప్పుడు అవన్నీ వినిపించడం లేదు. అయితే, రాయలసీమలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నా.. తాజాగా పల్నాడులో పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవలు చర్చనీయాంశం అయ్యాయి. ఇనుప రాడ్లతో వీధుల్లోకి వచ్చిన వీడియోలు కనిపించాయి. దీనిపై ఇరువర్గాల వారు ఎవరివాదన వారు వినిపిస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి పరారీలో ఉన్నారు. పల్నాడు గతంలోనూ ఉద్రిక్త ప్రాంతమే అయినా ఇప్పుడు మాత్రం మరింత తీవ్రత కనిపిస్తోంది.

Tags:    

Similar News