సెకీ డోంట్ వర్రీ.. ఏపీఈఆర్సీ సెన్షేషన్ రిపోర్టు!
సెకీ ఒప్పందాలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి విద్యుత్ కొనుగోలుకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకీ ఒప్పందాలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆదానీ సంస్థకు మేలు చేసేందుకు సెకీతో ఒప్పందాలు జరిగాయని, అంతేకాకుండా అదానీ సంస్థ నుంచి లంచాలు తీసుకున్నారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకోగా, తాజాగా సెకీ ఒప్పందం సక్రమమేనంటూ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది.
సెకీ ఒప్పందం అంతా నిబంధనలు మేరకే జరిగిందని, ఆ ఒప్పందాలను రద్దు చేయడం సాధ్యం కాదని విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. అదేవిధంగా డిస్కమ్ల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదముద్ర వేసిన ఏపీఈఆర్సీ ఈ ఏడాది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి యూనిట్ రూ. 2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పాతికేళ్లపాటు వ్యవసాయ అవసరాల కోసం రైతులకు నిరంతర విద్యుత్తు అందజేయడం కోసం ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం జరిగింది.
అయితే ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆదానీ సంస్థ భారీగా లంచాలు ఇచ్చిందని అమెరికా దర్యాప్తు సంస్థలు అక్కడి కోర్టులో అభియోగాలు నమోదు చేశాయి. దీంతో సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై గత ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చినా, రాజకీయంగా పెద్ద దుమారమే జరిగింది. అయితే సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక, ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. చివరికి అన్నీ నిబంధనల ప్రకారమే జరిగిందని తేలడంతో ఈ వివాదం సమసిపోయినట్లైంది.