మొదటి నెల పెన్షన్ లోనే అవినీతినా ?
విషయానికి వస్తే పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 1 July 2024 12:30 PM GMTసామాజిక పెన్షన్లు పెంచారు అన్న ఆనందం చేతివాటం గాళ్ల మధ్యన పడి నోట్లు కొన్ని సైడ్ కావడంతో పెన్షనర్లు లబోదిబోమనాల్సిన పరిస్థితి అని అంటున్నారు. మొదటి నెలలోనే అవినీతి జరిగిందా. పెన్షన్ పెంచిన మొత్తాలు ఎరియర్స్ అన్నీ కలిపి దక్కాల్సిన ఏడు వేల రూపాయలలో అయిదు వందల రూపాయలు నొక్కేశారా అన్న చర్చ సాగుతోంది.
విషయానికి వస్తే పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎరుకల కాలనీలో పెన్షన్ లబ్దిదారులకు ఏడు వేల రూపాయలకు బదులుగా ఆరు వేల అయిదు వందల రూపాయలు ఇచ్చారని అంటున్నారు.
దీంతో ఈ విషయం వెలుగు చూసింది. పెన్షనర్లు వృద్ధులు అయితే కావచ్చు కానీ వారికి తెలివి లేదనుకుంటే పొరపాటే కదా. ఏడు వేల రూపాయలు తీసుకుంటామని సంబర పడిన వారికి అయిదు వందల నోటు సైడ్ కావడంతో ఆ విషయాన్ని టీడీపీ నేతలకు చేరవేశారు. అలా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి విషయం చేరడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇలా చేతివాటం ప్రదర్శించిన సచివాలయ ఉద్యోగుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ ని ఆదేశించారు. దీంతో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బాలూ నాయక్ ని సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ ఒక్కచోటే కాదు చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది అని వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఎపుడూ ఇలా అవినీతి లంచాలు అన్నవి లేకుండా నేరుగా పెన్షన్ లబ్దిదారులకు అందేదని ఇపుడు చూస్తే చేతి వాటం ప్రదర్శిస్తూ మొదటి నెలలోనే మోసం చేస్తున్నారు అని వైసీపీ సోషల్ మీడియా వేదికా తన పోస్టులతో రచ్చ చేస్తోంది.
అంతే కాదు మొదటి నెల కాబట్టి సచివాలయాల సిబ్బందితో పెన్షన్ ఇప్పించారని, అలా కాకుండా రానున్న రోజులలో వారిని పక్కన పెట్టి టీడీపీ తన మనుషులతో అయినా పూర్వం మాదిరిగా జన్మభూమి కమిటీలతో పెన్షన్లు ఇప్పిస్తే అపుడు పూర్తిగా అవినీతి జరుగుతుందని హెచ్చరిస్తోంది. గతంలో జన్మభూమి కమిటీలలో వారు అంతా ఎపుడూ పూస్తి స్థాయి పెన్షన్ ఇవ్వలేదని కూడా గుర్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ పండుగ ఏపీలో జరుగుతూంటే అందులో ఈ చేతివాటం ఘటనలు పరువు తీశాయని అంటున్నారు. ఇది ఒక విధంగా మచ్చ లాగానే మారాయని అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ మెకానిజం తో పెన్షన్లు పూర్తిగా లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకుంటుందో. ఎందుకంటే వైసీపీ డేగ కళ్లతో వీటిని గమనించడం ఏకి పారేయడం ఖాయం. అందుకే జాగ్రత పడాల్సిందే అంటున్నారు.