2024 ఎన్నికలు : కేంద్రాన్ని ఏపీ శాసించే సీన్ ఉంటుందా...?

ఇప్పటికి రెండు ఎన్నికలు విభజన ఏపీ చూసింది. మొదటి ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు ఏపీ ప్రజలు

Update: 2023-09-07 06:48 GMT

ఇప్పటికి రెండు ఎన్నికలు విభజన ఏపీ చూసింది. మొదటి ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే అంత చక్కగా వినసొంపుగా బీజేపీ పెద్దలు ఏపీకి వచ్చి మాట్లాడారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించి ఇస్తామని అన్నారు. ప్రత్యేక హోదా అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తామని అన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని నమ్మబలికారు. విభజన హామీలు అన్నీ తీరుస్తామని కూడా చెప్పుకొచ్చారు. అప్పటికి ఉమ్మడి ఏపీని అడ్డంగా విడదీసింది అన్న ఆగ్రహంతో అయిదు కోట్ల మంది ప్రజలు బీజేపీని నమ్మారు. మోడీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భం అది.

ఇక ఏపీలోని తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దాంతో బాబు పాలనాదక్షత, బీజేపీ హామీలను నమ్మి అధికారం ఇచ్చారు కానీ ప్రత్యేక హోదా దక్కలేదు. రాజధాని కూడా నిర్మాణం కాలేదు, పోలవరం ప్రాజెక్ట్ అలాగే ఉంది. విభజన హామీలకు దిక్కు లేదు. దీంతో ప్రజలు టీడీపీ బీజేపీ పట్ల విసిగి 2019 ఎన్నికల నాటికి వైసీపీని గెలిపించారు.

దానికి కారణం జగన్ ప్రత్యేక హోదాను తెస్తామని అన్నారు. అలాగే కేంద్రంతో పోరాడైనా విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చినా ఏపీ పరిస్థితి మారలేదు కేంద్రం వైసీపీని కూడా తన చెప్పుచేతలలో ఉంచుకుంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇక వైసీపీ గెలిచిన తొలి రోజు నుంచే చెప్పేసింది. కేంద్రంలో బీజేపీకి అఖండమైన మెజారిటీ ఉంది. మా అవసరం లేదు కాబట్టి మేము ఏమీ చేయలేమని కూడా చెప్పేసింది.

ఈ పరిణామాలు ఇలా ఉండగానే 2024 ఎన్నికలు వస్తున్నాయి. అటు వైసీపీ ఇటు టీడీపీ కేంద్రంలోని బీజేపీతో చెలిమికి పోటీ పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన జనసేన పార్టీ అయితే బీజేపీకి మిత్రుడిగా మారింది. కేంద్రాన్ని నిలదీసి ఏపీ హక్కులను కాపాడుతామని ఏ ఒక్క పార్టీ నుంచి కచ్చితమైన హామీ అయితే రావడం లేదు.

పైగా చంద్రబాబు 2018లో కాని టైం లో బీజేపీతో విడిపోయారు. ఇపుడు బీజేపీ బలం తగ్గి విపక్షాల మధ్య ఐక్యత చిగురించిన వేళ మోడీని విజనరీ అంటూ దగ్గర కావడానికి చూస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో నెగ్గి ఏపీలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు.

ఇక వైసీపీ అయితే తెర చాటు మద్దతు అలాగే కొనసాగించాలని చూస్తోంది. జనసేన కూడా బీజేపీతో పొత్తుని తెంచుకునే ఆలోచన ఏదీ చేయడంలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు దక్కాల్సిన హక్కులు ఏమైపోతాయి అన్న ప్రశ్న అయితే వస్తోంది. ప్రత్యేక హోదాను మరచిపోవాల్సిందేనా, రాజధాని ఏపీకి ఎప్పటికి నిర్మాణం అవుతుంది. పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది ఇవన్నీ ప్రశ్నలే. అంతే కాదు, విభజన హామీలు అలాగే ఉండిపోయాయి.

ఏపీ ఆస్తులు అన్నీ హైదరాబాద్ లో ఉంటే వాటికి విలువ కట్టి ఏపీ రావాల్సిన లక్షలన్నర కోట్ల రూపాయలకు పైగా నిధులను ఎపుడు ఇప్పిస్తారు ఇవన్నీ ప్రజల మదిలో మెదిలే ప్రశ్నలు. వీటికి జవాబు అయితే లేదు అనే అంటున్నారు. కేంద్రంలో మూడవసారి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏపీ పరిస్థితి మారదు అంటున్నారు. ఏపీలో వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా ఒక్కటే అన్న చర్చ అయితే ఉంది. జగన్ అయినా చంద్రబాబు అయినా బీజేపీతో పోరాడి ఏపీకి రావాల్సినవి తీసుకుని వస్తారా అన్నదే ఒక చర్చ. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ఏదో జరిగిపోతుంది అన్నది మాత్రం ప్రజలకు అనిపించడంలేదు అంటున్నారు.

Tags:    

Similar News