ఇంచార్జి మంత్రులు వస్తున్నారా ?

అవి జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన సమావేశాలుగా ఉంటాయి. ఆ సమావేశాలలో తీసుకునే నిర్ణయాలే పవర్ ఫుల్ గా ఉంటాయి

Update: 2024-07-30 03:52 GMT

తొందరలో ఆగస్ట్ పదిహేను పండుగ జరగనుంది. ఈ నేపధ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంచార్జి మంత్రులను వివిధ జిల్లాలకు నియమిస్తుందా అంటే చేయవచ్చు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి మండలి సమావేశాలు ఇంకా ఎక్కడా జరగలేదు. వాటికి జిల్లా ఇంచార్జి మంత్రులే అధ్యక్షత వహిస్తారు.

అవి జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన సమావేశాలుగా ఉంటాయి. ఆ సమావేశాలలో తీసుకునే నిర్ణయాలే పవర్ ఫుల్ గా ఉంటాయి. వాటినే ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అలా జిల్లా ఇంచార్జి మంత్రులు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తారు. దాంతో పాటుగా జిల్లా అభివృద్ధి ప్రభుత్వం పార్టీల మధ్య కో ఆర్డినేషన్ వంటి వాటిలో కూడా ఇంచార్జి మంత్రుల పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుంది.

టీడీపీ కూటమి ఇంచార్జి మంత్రుల నియామకం తొందరలోనే చేపట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. కొన్ని జిల్లాలలో మంత్రులు కొత్తవారుగా ఉన్నారు. ఆయా జిల్లాల భారాన్ని వారు మోయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అంతే కాదు మొత్తం పరిస్థితులను ఒక కొలిక్కి తేవాలన్నా కూడా అనుభవం అవసరం అని అంటున్నారు.

కీలకమైన ఉత్తరాంధ్రాలో విశాఖకు ఒకే ఒక మంత్రి ఉన్నారు. దాంతో విశాఖకు ఇంచార్జి మంత్రి ఉండాలని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా కొత్తవారే కావడంతో పాటు కూటమిలోనూ టీడీపీలోనూ అంతా ఒక్కటిగా ఉంచేలా ఇంచార్జి మంత్రి ఉంటే బాగుంటుందని అంటున్నారు.

కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య కో ఆర్డినేషన్ కూడా అవసరం అని అంటున్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ అర్హులను ఎంపిక చేయడంతో పాటు కూటమి భాగస్వాముల మధ్య పొరపొచ్చాలు లేకుండా అంతా కలసి కూర్చుని ఒక మాట మీదకు రావాలన్నా జిల్లా బాధ్యుడిగా ఒకరిని నియమించాల్సి ఉందని అంటున్నారు.

ఇక ఆగస్టు 15 వేల జిల్లా ఇంచార్జి మంత్రులే జెండా వందనం చేస్తారు. ఆ సంప్రదాయం ఉంటూ వచ్చింది. దాంతో ఈసారి దాని కంటే ముందే ఇంచార్జి మంత్రుల నియామకం జరుగుతుందా అన్న చర్చ మొదలైంది. మొత్తం 26 జిల్లాలు ఏపీలో ఉన్నాయి. మంత్రులు చూస్తే 24 మంది ఉన్నారు. దాంతో వీరిలో ఎవరికి ఇంచార్జి మంత్రి పదవులు ఇస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది.

ఈ విషయంలో తెలుగుదేశం నుంచి చూస్తే 20 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాకుండా మిగిలిన వారిని ఇంచార్జి మంత్రులుగా నియమించే ప్రతిపాదన అయితే ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News