ఈ మంత్రుల వేగం.. చంద్రబాబు కంటే ఎక్కువేగా..!
ఈ సమస్య గడిచిన ఐదేళ్లుగా కూడా వారిని వెంటాడింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
ఈ మంత్రులు ఫాస్ట్ బాస్` అనే మాట వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులు బిజీబిజీగా గడపడంతో పాటు ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు చేస్తుండటం అందరిని ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. చంద్రబాబు చాలా ఆచితూచి తన టీంను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. అనేక మంది సీనియర్లను కూడా ఆయన పక్కన పెట్టి కొత్తవారికి ఈసారి పగ్గాలు అప్పగించారు. ఎంపిక విధానం ఎలా చేశారు అనేది ఆయన చెప్పకపోయినా మంత్రులు తాము చేస్తున్న పనితీరులో చంద్రబాబు ఎలా ఎంపిక చేశారు అనే విషయాన్ని స్పష్టంగా గమనించేలా చేస్తున్నారు.
ఉదాహరణకు అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అలాగే కొండపి ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వంటి వారు చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అద్దంకి ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో విద్యుత్తు లైన్లు వేలాడుతున్నాయని, దీనివల్ల సాగుకు ఇబ్బంది కలుగుతుందని కొందరు రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్య గడిచిన ఐదేళ్లుగా కూడా వారిని వెంటాడింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. గొట్టిపాటి రవి మాత్రం తనకు ఫిర్యాదు అందిన రెండు గంటల వ్యవధిలోని విద్యుత్ అధికారులను రంగంలోకి దింపి విద్యుత్ స్తంభాలు నాటించి వారి సమస్యను పరిష్కరించారు. ఇక, హోం మంత్రి అనిత విషయాన్ని పరిశీలిస్తే.. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. ఇటీవల విజయవాడలో తలెత్తిన ఘటన కావచ్చు, అంతకుముందు నెల్లూరులో చోటు చేసుకున్న అత్యాచార ఘటన కావచ్చు తక్షణం స్పందిస్తున్నారు.
అదేవిధంగా.. వర్షాలు ఎక్కడైనా పడుతున్నాయని తెలియగానే అనిత క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా ఉంటున్నారు. మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా తన దృష్టికి వచ్చిన అంశాలపై తక్షణమే స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి వెంటనే కృషి చేస్తున్నారు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన మంత్రిగా ఉంటూనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఖరీఫ్ సాగు సాగుతున్న క్రమంలో సాగినీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు ఆయన క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తూ అక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ కనిపిస్తున్నారు.
ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత కూడా తొలిసారి పగ్గాలు చేపట్టారు. కానీ, ఆమె కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ హాస్టల్ ను తనిఖీ చేస్తున్నారు. బీసీ పథకాల విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వారు తీసుకునే ఆహారం వారి వసతి. హాస్టల్ దుస్థితిని కూడా ఆమె తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఆవిడ తన వ్యక్తిగత ఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు ఇస్తూ ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని చెప్పడంతో పాటు వారు ఫోన్ చేయగానే కూడా స్పందిస్తున్నారు. దీంతో చంద్రబాబు టీంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.