తెలంగాణలో ఐదు గ్రామాల విలీనంపై ఏపీ వాదన ఇదే!

ఈ నేపథ్యంలో ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాల్లో 10 వేల మంది నివాసం ఉంటున్నారు.

Update: 2024-07-07 07:53 GMT

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా నాడు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో కలిపిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల పరిధిలోకి ఇవి వస్తుండటంతో.. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉండకూడదనే ఉద్దేశంతో.. అవి ఒకే రాష్ట్రంలో ఉంటే మంచిదని భావించి ఆంధ్రాలో విలీనం చేశారు.

కాగా తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవడానికి జరిపిన చర్చల్లో విలీన మండలాల అంశం కూడా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ ను తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యక్తం చేసింది.

ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను తిరిగి తమకు ఇచ్చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

భద్రాచలం పట్టణాన్ని మినహాయించి దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉండటంతో పరిపాలనపరమైన, సాంకేతికపరమైన, సరిహద్దు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఆ ఐదు పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం కూడా చేశాయి.

ముఖ్యంగా భద్రాచలం పట్టణం రెండు రాష్ట్రాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. ఎంతో మంది నిత్యం రాములవారి దర్శనానికి వస్తుంటారు. ఏటా 40 లక్షల మంది వరకు భద్రాచలం వస్తున్నారని అంచనా. ఈ నేపథ్యంలో వసతుల కల్పనకు కావాల్సిన భూమి ఇబ్బంది అవుతోంది. అలాగే పట్టణంలో 80 వేల మంది నివసిస్తున్నారు. దీంతో వాహనాల పార్కింగ్‌ కు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులకు కూడా సరైన స్థలాలు లేవంటున్నారు.

భద్రాచలంను ఆనుకుని ఉన్న గ్రామాలను తీసుకోవడానికి అవి ఆంధ్రాలో ఉన్నాయి. దీంతో భూసేకరణ సమస్య తెలంగాణకు తలెత్తుతోంది. అలాగే రాములవారి భూములు ఏపీలో విలీనమైన పలు గ్రామాల్లో ఉన్నాయి. వాటిని దేవస్థానం అవసరాలకు వాడుకోవడానికి కూడా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

భద్రాచలం రామాలయానికి 3 కి.మీ దూరంలోని పురుషోత్తపట్నంలో రాములవారికి 860 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని దేవస్థానం అవసరాలకు వాడుకోవచ్చు. అయితే ఈ గ్రామం ఏపీలో ఉంది. దీంతో పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే ఉష్ణగుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, యటపాక పంచాయతీలు కూడా భద్రాచలానికి ఆనుకునే ఉన్నా అవి కూడా ఏపీలో ఉండటంతో «భద్రాచలం దేవాలయానికి వాడుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది.

ఈ నేపథ్యంలో ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాల్లో 10 వేల మంది నివాసం ఉంటున్నారు.

అయితే ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం తమ చేతుల్లో లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణలో ఏడు మండలాలను, అందులో భాగంగానే ఈ ఐదు పంచాయతీలను ఏపీలో కలిపిందని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలంటే ఆ పని కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెబుతోంది.

ఒక రాష్ట్రంలోని గ్రామాలను ఇతర రాష్ట్రాలకు కలపడం, కేటాయించడం వంటి పనులు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. అలా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఐదు గ్రామాల కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News