తెలుగు వారికి భారీ షాకిచ్చిన యాపిల్... చేసిన పని అలాంటిదంట!
ఈ సమయంలో.. ఈ గ్లోబల్ టెక్ జెయింట్ తెలుగు వారిని మాత్రమే ఎందుకు తొలగించిందనే చర్చ తెరపైకి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటైన అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు యాపిల్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెరపైకి వచ్చిన ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా... ఆ సంస్థ బే ఏరియా కార్యాలయంలో పనిచేస్తున్న అనేక మంది తెలుగు ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి.
అవును... తెలుగు ఉద్యోగులకు యాపిల్ సంస్థ తాజాగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 185 మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ పని నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో.. ఈ గ్లోబల్ టెక్ జెయింట్ తెలుగు వారిని మాత్రమే ఎందుకు తొలగించిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ స్కామ్ గురించి చెబుతున్నారు.
సాధారణంగా కంపెనీలు తమ తమ ఉద్యోగులను తొలగించడానికి చేపట్టే లే ఆఫ్స్ చర్యలు.. ఖర్చులను తగ్గించుకోవటానికి చేస్తాయని చెబుతుంటారు. అయితే... తాజాగా తెలుగు ఉద్యోగుల విషయంలో యాపిల్ చేసింది అందుకు కాదు! ఈ విషయంలో... యాపిల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) నిబంధనల్లో భాగంగా చేసిన పనిలో స్కామ్ బయటపడటమే కారణం అని అంటున్నారు.
యాపిల్ ఉద్యోగులు కొన్ని తెలుగు సంఘాలకు డబ్బును విరాళంగా అందించారంట. అయితే.. ఆ నిధులను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగించకుండా.. ఆ సంఘాలు డబ్బును తిరిగి ఉద్యోగులకు పంపించాయనేది ఆరోపణ. ఇది యాపిల్ యొక్క సీఎస్సార్ ప్రోగ్రామ్ నుంచి చట్టవిరుద్ధంగా లాభపడటానికి ఉద్యోగులను అనుమతించిందని చెబుతున్నారు.
ఆపిల్ సంస్థ ఫైనాన్స్ విభాగం గుర్తించిన ఈ అవకతవకలపై దర్యాప్తులో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. దీంతో... ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న ఉద్యోగులను రాజీనామా చేయాలని, లేదంటే కంపెనీ టెర్మినేట్ చేస్తుందని స్పష్టం చేసిందని అంటున్నారు. దీంతో.. 185 మంది తెలుగు ఉద్యోగులు జాబ్స్ కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
వీరిలో సీనియర్ మేనేజర్ల నుంచి ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల వరకూ ఉన్నారని అంటున్నారు. ఈ వ్యవహారం.. అమెరికాలో పని చేస్తున్న కొన్ని తెలుగు సంఘాల చిత్తశుద్ధిపై తీవ్ర ఆందోళనకు దారి తీసిందని అంటున్నారు. ప్రధానంగా యాపిల్ యొక్క సీఎస్సార్ వంటి ప్రోగ్రామ్స్ పై కూడా ఈ ఘటన నమ్మకాన్ని దెబ్బతీసిందని అంటున్నారు.
యాపిల్ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీ.ఎఫ్.ఓ) గా భారతీయ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్ ను ప్రమోషన్ ద్వారా తీసుకున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. కెవాన్ ఫరేక్ ఈ ఏడాది జనవరి 1 నుంచి యాపిల్ సీ.ఎఫ్.ఓ.గా బాధ్యతలు స్వీకరించారు.