ఇలాంటి రికార్డులు ఐఫోన్ కు మాత్రమే సాధ్యం బాస్

2024 లో యాపిల్ కంపెనీ మన దేశంలో తయారైన ఐఫోన్ల ఎగుమతులు ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును దాటేసింది.

Update: 2025-01-15 04:05 GMT

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి వంద మందిలో 90 మందికి అవకాశం ఉండలే కానీ ఐఫోన్ వాడేయాలనుకుంటారు. అదీ.. ఐఫోన్ స్పెషాలిటీ. అంతటి క్రేజ్ మరే ఫోన్ కు లేదనే చెప్పాలి. నిజానికి ఐఫోన్ క్రేజ్ ఒక్క భారతీయులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికి ఉంటుంది. తన ఉత్పత్తులతో దుమ్ము లేపే యాపిల్.. గడిచిన ఏడాదిలో తన ఐఫోన్ల ఎగుమతులతో అరుదైన రికార్డును సాధించింది.

2024 లో యాపిల్ కంపెనీ మన దేశంలో తయారైన ఐఫోన్ల ఎగుమతులు ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును దాటేసింది. ఇండస్ట్రీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం 2024లో యాపిల్ ఎగుమతులు 12.8 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. దీన్ని మన రూపాయిల్లోకి మారిస్తే దగ్గర దగ్గర రూ.1.10 లక్షల కోట్లకు సమానం. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసే నాటికి ఈ విలువ మరింత పెరగనుంది.ఈ మొత్తం ఎగుమతుల్లో 42 శాతం ఐఫోన్లదే కావటం మరో విశేషంగా చెప్పాలి.

దేశీయంగా ఉత్పత్తి కూడా దాదాపు 46 శాతం ఐఫోన్లదేనని చెబుతున్నారు. ఇప్పుడు వెలువడిన గణాంకాలు.. అంచనాలన్ని కూడా 2024 జనవరి నుంచి డిసెంబరు వరకు మాత్రమే. ఇది మరింత పెరుగుతుందని చెబుతన్నారు. మరో ఆసక్తికరమైన అంశాన్ని ఇక్కడ చెప్పాలి. ఐఫోన్ తయారీ కాంట్రాక్టు కలిగిన ఫాక్స్ కాన్.. విస్ట్రాన్.. పెగాట్రాస్ లాంటి కంపెనీల కారణంగా 1.85 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.

అంతేకాదు.. ఈ కంపెనీల్లో పని చేసే వారిలో మూడొంతుల మంది మహిళలే కావటం మరో ప్రత్యేకతగా చెబుతారు. ఐఫోన్ల ముచ్చట ఇలా ఉంటే.. దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రోత్సాహక పథకం కారణంగా మన దేశంలో రూ.4.10 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరగటం గమనార్హం.

Tags:    

Similar News